అన్న ఆస్ట్రేలియాకు వెళ్లారు.. తిరిగి వచ్చారు. తమ్ముడు వెళ్లబోతున్నారు. కుటుంబసమేతంగానే. అక్కడ హాలీడేస్ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు. వస్తున్నారు. అక్కడికే ఎందుకు… అంటే మాత్రం.. ఆ విషయం వారికే తెలియాలి. మునుగోడు ఉపఎన్నికల్లో కౌంటింగ్ ముగియగానే రాజగోపాల్ రెడ్డి ఆస్ట్రేలియా వెళ్లిపోతున్నారు. తనకు.. తన భార్య కోసం బుక్ చేసుకున్న టిక్కెట్లు ఈ మేరకు వెలుగులోకి వచ్చాయి.
ఈ నెల 6 వ తేదీన ఫలితాలు ప్రకటించగానే 7వ తేదీన ఆస్ట్రేలియా టూర్కు వెళుతున్నట్లు తెలుస్తోంది. విశ్రాంతి కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లబోతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తన ప్రయాణానికి సంబంధించి బుక్ చేసుకున్న విమాన టిక్కెట్లు కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. గత నెల 15న ఆస్ట్రేలియాకు వెళ్లిన ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. హైదరాబాద్కు వచ్చేశారు.
ఉపఎన్నికల్లో ఫలితంతో సంబంధం లేకుండా రాజగోపాల్ రెడ్డి విశ్రాంతి కోసం ఆస్ట్రేలియా వెళ్తున్నారని.. అంటున్నారు. అయితే ఆయన సోదరుని కుటుంబం ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చేసింది. ఇప్పుడు మళ్లీ ఆయన కూడా అక్కడకే ఎందుకు వెళ్తారని అంటున్నారు. ఇటీవలి కాలంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన బ్యాంక్ అకౌంట్ల వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు ఆయన టిక్కెట్ల వివరాలు కూడా రావడంతో బీజేపీ నేతలు తమ ఫోన్లపై నిఘా పెట్టారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ అంశంపై రాజగోపాల్ రెడ్డి ఇంకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.