రుషికొండలో నిబంధనలు ఉల్లంఘించినట్లుగా తేలితే అధికారులను జైలుకు పంపిస్తామని హైకోర్టు గతంలోనే హెచ్చరించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా ఇష్టా రాజ్యంగా తవ్వకాలు.. అనుమతల్లేకుండా నిర్మాణాలు చేస్తున్నారు. నిన్నటి వరకూ అసలు అక్రమమేం లేదు.. నిబంధనల ప్రకారమే అన్నీ చేస్తున్నామని చెప్పుకొచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మూడు ఎకరాల మేర అక్రమంగా తవ్వామని హైకోర్టులో ఒప్పుకుంది. అధికారుల్ని నిండా ముంచేసింది. ప్రభుత్వమే అఫిడవిట్ వేయడంతో ఇవాళ కాకపోతే. రేపైనా అధికారులు జైలుకెళ్లాల్సిందే.
అయితే ప్రభుత్వం మూడు ఎకరాలేనంటోంది కానీ తవ్వింది ఇరవై ఎకరాల పైనే ఉంటుందని.. పిటిషన్లు ఆరోపించారు. దీంతో దీంతో హైకోర్టు సర్వే చేయాలని ఆదేశించింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 14వ తేదీకి వాయిదా వేసింది. గత విచారణలో హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వం తీరుపై అనుమానం వ్యక్తం చేసింది. తవ్వకాలకు సంబంధించి ఏదో దాస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేసింది. అప్పుడు వాయిదా కోరిన ప్రభుత్వం మూడు ఎకరాలు అదనంగా తవ్వామని అంగీకరించింది.
నిర్మాణాలను కూడా గతంలో కూల్చివేసిన ప్రాంతాల్లో ఎంత మేర నిర్మాణం ఉందో అంత మేరకే నిర్మాణం చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం ఉల్లంఘిస్తూ.. నిర్మాణాలకు కూడా ఎలాంటి అనుమతులు లేకపోయినప్పటికీ.. కట్టడాలు ప్రారంభమయ్యాయి. దీనిపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ అటవీ పర్యావరణ శాఖ సర్వే తర్వాత హైకోర్టు తీసుకునే చర్యలు కీలకం కానున్నాయి