ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై కేసీఆర్ మౌనం వీడారు. మునుగోడులో పోలింగ్ ముగిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ముఠా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు తిరుగుతోందని.. దీనికి అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్‌లు నాయకత్వం వహిస్తున్నారని ప్రకటించారు. మూడు గంటల ఫామ్ హౌస్ వీడియోలు ఉన్నాయని.. అయితే ప్రేక్షకుల.. ప్రజల సౌకర్యార్థం వాటిని గంటకు కుదించి అందరికీ పంపిస్తున్నామన ిప్రకటించారు. దేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను మార్చారని.. ఆ ఆపరేషన్ల గుట్టు మొత్తం ఆ వీడియోలో ఉందన్నారు.
ప్రస్తుతం.. ఢిల్లీ, తెలంగాణ, రాజస్థాన్‌తో పాటు ఏపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూడా బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని కేసీఆర్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఏపీలో అరవై మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా ప్రభుత్వం మారదు. అయితే ఏపీలో అధికార పార్టీలో ఓ కీలక నేత తిరుగుబాటు చేస్తారని బీజేపీ అనుకూల చానల్స్ రిపబ్లిక్ టీవీలో గతంలో ప్రచారం జరిగింది. కానీ అలాంటిది జరుగుతుందని ఎవరూ అనుకోవడం లేదు. కానీ ఇటీవల జగన్ తనను శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్న తర్వాత సజ్జల అలాంటి వ్యాఖ్యలే చేశారు. దీంతో సందేహాలు అలాగే ఉన్నాయి. కేసీఆర్ ప్రకటన తర్వాత ఏపీ కూడా బీజేపీ హిట్ లిస్ట్‌లో ఉన్నదని కన్ఫర్మ్ చేసుకోక తప్పదు.
మొత్తంగా 2016 నుంచి ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. వారికి సంబంధించి కాల్ లిస్ట్ మొత్తం తమ దగ్గరకు వచ్చిందన్నారు. మొత్తం70వేలపేజీల సమాచారం ఉందన్నారు. ఈ సమాచారాన్ని అందరు న్యాయమూర్తులకు పంపామని..మీడియాకు కూడా ఇస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. తమకు వచ్చిన సమాచారం వచ్చినట్లుగా అందరికీ చేరవేశామన్నారు. బీజేపీ చేస్తున్నది తప్పనికేసీఆర్ మండిపడ్డారు. తమ పార్టీలో ఎమ్మెల్యేలను అనైతిక పద్దతిలో చేర్చుకోలేదని.. లేఖలు ఇస్తేనే చేర్చుకున్నామన్నారు. ఈ అంశంపై ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి తాను సిద్ధమని కేసీఆర్ ప్రకటించారు.
ప్రభుత్వాలను కూల్చే ముఠా నాయకుడు ఎవరన్నది బయటకు రావాలని.. అందరూ పూనుకుంటేనే ఇది సాధ్యమవుతుందన్నారు. మొత్తానికి కేసీఆర్.. పంపిన వీడియోల్లో ఏముందో నిశితంగా పరిశీలిస్తేనే వెల్లడవుతుంది. ఈ అంశం రాజకీయంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాల్సి ఉంది.