మునుగోడులో గత ఎన్నికల్లో 91 శాతానికిపైగా పోలింగ్ జరిగితే.. ఈ సారి మరో శాతం పెరిగింది. సాధారణంగా ఉపఎన్నికల్లో తక్కువ పోలింగ్ నమోదవుతుంది. కానీ ఈ సారి రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పెరిగింది. అన్ని ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్కు అనుకూల తీర్పు ఇచ్చాయి. ఆ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుస్తారని ప్రకటించాయి. కారణం ఏదైనా… అధికార పార్టీ అడ్వాంటేజ్ టీఆర్ఎస్కు బాగా కలసి వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఫలితం తేడా వస్తే.. ముందుగా మునిగిపోయేది కోమటిరెడ్డి బ్రదర్సే. వ్రతం చెడినా ఫలితం దక్కదు. ఓడిపోయిన నేతకు బీజేపీలో ఇక ప్రాధాన్యం దక్కదు. తమ్ముడి కోసం కాంగ్రెస్‌ను భ్రష్టుపట్టించి అన్న కోమటిరెడ్డి ఇప్పటికే రాజకీయాల్లో ఓ బ్యాడ్ క్యారెక్టర్ అన్న విధంగా ప్రొజెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఆయనకు కాంగ్రెస్‌లో భవిష్యత్ ఉండదు. తమ్ముడు ఓడిపోయినా బీజేపీలో చేరితే ఆయనకూ ప్రయోజనం ఉండదు. మొత్తంగా కోమటిరెడ్డి సోదరులు.. తమ పొలిటికల్ లైఫ్‌ను రిస్క్‌లో పెట్టేసుకున్నారు. ఆ పద్దెనిమిది వేల కాంట్రాక్ట్ కూడా ఉంటుందో.. ఊడుతుందో చెప్పడం కష్టం.
ఉపఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయం మరింత రసవత్తరంగా మారనుంది. రాజగోపాల్ రెడ్డి ఓడితే.. బీజేపీ… వచ్చే ఎన్నికల్లో అధికారం విషయంపై మరింత గట్టిగా ఆలోచించాల్సి వస్తుంది. ఏడాది కూడా లేని తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కేసీఆర్ ఆరోపిస్తూంటే.. కనీసం కౌంటర్ ఇవ్వలేని స్థితికి బీజేపీ నేతలు చేరారు. అసలు రాజకీయం ఆరో తేదీ తర్వాత జరగనుంది.