వైసీపీ ఎమ్మెల్యేలే చేసే పనులకు ఎంత దారుణంగా ఉంటాయో.. సమర్థింపులు కూడా అంత కంటే ఎక్కువ దరిద్రంగా ఉంటాయి. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఇటీవల గడప గడపకూ మన ప్రభుత్వం అంటూ ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడ సొంత పార్టీ నేతలే అడ్డుకుని.. ఫలానా పనులు చేస్తామని చేయలేదని నిలదీస్తే బూతులు తిట్టడమే కాదు చేయిచేసుకున్నారు. ఈ వీడియో వెలుగులోకి వచ్చింది.. వైరల్ అయింది. ఇలాంటివి చాలా జరిగాయి కానీ వైసీపీ నేతలు స్పందించ లేదు. కానీ రవీంద్రనాథ్ రెడ్డి మాత్రం ప్రెస్‌మీట్ పెట్టి సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
తాను తప్పు చేయలేదని చెప్పడానికి ఆయన బాలకృష్ణను ఉదాహరణగా ఎంచుకున్నారు. బాలకృష్ణ చాలా సార్లు అభిమానుల్ని కొట్టారని ఆయన కొట్టినప్పుడు లేని తప్పు..తాను కొడితే వచ్చిందా అని చెప్పుకొచ్చారు. మరి బాలకృష్ణలా .. రవీంద్రనాథ్ రెడ్డి తన అభిమానిని కొట్టారా అంటే అవునంటున్నారు. కొట్టించుకున్న వ్యక్తిని ప్రెస్‌మీట్‌కు తీసుకొచ్చి సాక్ష్యం కూడా చెప్పించారు. తాను రవీంధ్రనాథ్ రెడ్డి అభిమానని చెప్పారు. తరతరాలుగా వైఎస్ కుటుంబంపై అభిమానంతో ఉన్నామన్నారు. అందుకే అభిమానంతోనే కొట్టించుకున్నాన్నారు.
అయితే కుటుంబ అభిమానం గురించి మాట్లాడిన తర్వాత రవీంద్రనాథ్ రెడ్డికి తనను జగన్ మామ .. జగన్ మామ అనడం నచ్చలేదు. తనకు ఓ పదవి ఉంది.. హోదా ఉంది.. రాజకీయ పలుకుబడి ఉంది.. ప్రతీ సారి జగన్ బంధువు.. జగన్ బంధువు అనడం ఏమిటని ఆయనంటున్నారు. ఆ బంధుత్వం వల్ల వచ్చిన అభిమానినే కొట్టినట్లుగా కవరింగ్ చేసుకుని .. తర్వాత.. జగన్‌తో బంధుత్వం కన్నా తనకు ముందు ఇమేజ్ ఉందని చెప్పుకోవడం సింక్ కాలేదు. అందుకే ఆయనపై సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.