ఏపీలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. పోలీసు వ్యవస్థ అర్థరాత్రి గోడలు దూకి ప్రతిపక్ష నాయకుల్ని అరెస్టులు చేయడానికి .. అధికార యంత్రాంగం విపక్ష పార్టీలకు చెందినవారి ఆస్తులను కూలగొట్టడానికి సమయం అంతా కేటాయిస్తోంది. మరో వైపు ప్రతిపక్ష నేతలపై దాడులకూ తెగబడుతున్నారు. స్వయంగా ప్రతిపక్ష నేత నందిగామ జిల్లాలో పర్యటిస్తూంటే ఆయనపై రాళ్ల దాడి జరిగింది. నందిగామలో చంద్రబాబు పర్యటనకు పెద్ద ఎత్తున జనం వచ్చారు.
ఆయన మాట్లాడుతున్న సమయంలో ఒక్క సారిగా కరెంట్ నిలిచిపోయిది. ఆ తర్వాత రాళ్లు వచ్చి పడ్డాయి. దీంతో చంద్రబాబు సెక్యూరిటీ ఆఫీసర్‌కు గాయాలయ్యాయి. ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగిందన్న అనుమానాన్ని టీడీపీ నేతలు వ్యక్తం చేశారు. రాళ్ల దాడి జరిగిన తర్వాత ఆయన చుట్టూ.. సెక్యూరిటీ సిబ్బంది మోహరించారు. ఈ ఘటనపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ మొత్తం పులివెందుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ రౌడీలకు భయపడే ప్రశ్నే లేదన్నారు.
పోలీసులు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని.. భద్రత గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు భద్రతకు పని చేసే పోలీసులకన్నా ఆయన పర్యటనలో ఉండే ఇంటలిజెన్స్ పోలీసులే ఎక్కువన్న వాదన చాలా కాలంగా ఉంది. ఇప్పుడీ దాడి ఘటనపై పోలీసులు.. ఏం స్పందిస్తారో చూడాల్సి ఉంది.గతంలో ఇలాగే రాళ్ల దాడి చేసినప్పుడు ఐపీఎస్ సవాంగ్..ప్రజలు భావప్రకటనా స్వేచ్చను ఉపయోగించుకున్నారని అడ్డగోలుగా వాదించారు.