జనసేన ప్లీనరీకి పొలాలను ప్రభుత్వానికి భయపడకుండా ఇచ్చిన వారి ఇళ్ల కూల్చివేతకు జరిగిన ప్రయత్నాలపై పవన్ స్వయంగా పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటం గ్రామంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం పర్యటించనున్నారు. జనసేన ప్లీనరీ సమావేశానికి ఇప్పటం గ్రామస్తులు తమ పొలాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు గ్రామంలో 120 అడుగుల రోడ్ నిర్మిస్తామంటూ దారిలో ఉన్న ఇళ్లననింటినీ కూల్చేస్తున్నారు. ప్రధాన రహదారి నుంచి గ్రామానికి వచ్చే అప్రోచ్ రోడ్ కేవలం పదిహేను అడుగులు మాత్రమే ఉందని.. గ్రామంలో అంతర్గత రహదారి మాత్రం 120 అడుగుల పేరుతో ఇళ్లను కూల్చేస్తున్నారని అక్కడి గ్రామస్తులు ఆందోళన చేశారు. జనసేన వర్గీయులు అన్న కారణంగానే ఇళ్లను కూల్చేస్తున్నారని ఆరోపించారు.
ప్లీనరీకి స్థలాలు ఇచ్చినందుకు పవన్ కల్యాణ్.. గ్రామానికి యాభై లక్షల విరాళం ఇచ్చారు. దాంతో వారు ఓ కమ్యూనిటీ హాల్ నిర్మించుకున్నారు. అయితే… ఆ డబ్బులు సీఆర్డీఏకు జమ చేయాలని .. అధికారులు ఒత్తిడి చేశారు. వారు వినిపించుకోలేదు.. పవన్ కల్యాణ్ ఇచ్చిన వాటితో పాటు మరికొంత జమ చేసి.. కమ్యూనిటి హాల్ నిర్మహించుకున్నారు. అయితే దానికి బలవంతంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టారు. కూల్చివేతలపై ఉన్నపళంగా ఇప్పటం గ్రామాస్తులు హైకోర్టును ఆశ్రయించారు. కూల్చివేతలపై హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే ఆర్డర్స్ అందే వరకూ తాము కూల్చివేతలు కొనసాగిస్తామని సిబ్బంది తేల్చి చెప్పారు. దీంతో సాయంత్రం వరకూ కూల్చివేతలు కొనసాగాయి.
రోడ్డు విస్తరణ పేరుతో వైసీపీ ప్రభుత్వం అరాచకం సృష్టిస్తుందని పవన్ మండిపడ్డారు. బాధితులకు అండగా నిలబడాలని .. ఇప్పటం గ్రామ పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పవన్ నేరుగా రంగంలోకి దిగడంతో ప్రభుత్వ వర్గాలు ఉలిక్కి పడుతున్నాయి. ఆయన పర్యటనను సజావుగా సాగనిస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. శనివారం ఉదయం..ఆయనను అడ్డుకునే అవకాశం ఉందని .. ఇటీవలి పరిణామాల ద్వారా అర్థం చేసుకోవచ్చని జనసేన వర్గాలు అనుమానిస్తున్నాయి.