ఏపీలో నడిరోడ్డుపై హత్యాయత్నాలు చేసిన వాళ్లకు పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. వారికి పోలీస్ స్టేషన్లలో పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజాసమస్యపై పోరాడే ప్రతిపక్ష నేతలకు మాత్రం ఎలాంటి సెక్యూరిటీ ఉండదు. ప్లాన్డ్గా కరెంట్ ఆపేసి… రాళ్ల దాడి చేస్తారు. అందుకు పోలీసులు సహకరిస్తారు. ఎక్కడికైనా వెళ్తూంటే.. హౌస్ అరెస్టులు చేస్తారు. ఇందు కోసం కృత్రిమ ఉద్రిక్తతలు సృష్టించడానికి కూడా పోలీసుల సహకారం ఉంటుంది. ఏపీలో ఇప్పుడున్నది ఇదే పరిస్థితి.
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేతలపై అయితే అరెస్టులు.. లేకపోతే దాడులు అన్నట్లుగా రాజకీయం మారిపోయింది. ప్రతిపక్ష నేతలెవరూ స్వేచ్చగా తిరిగే పరిస్థితి లేకపోవడం.. ఒక వేళ ఎక్కడికి వెళ్లినా వైసీపీ నేతలు ఉద్రిక్తలు సృష్టిస్తూండటంతో ఆ పర్యటనలన్నీ వివాదాస్పదమవుతున్నాయి. పోలీసుల తీరును ప్రశ్నించేలా చేస్తున్నాయి. మరో వైపు అందరూ ప్రభుత్వంపై వేలెత్తి చూపేలా చేస్తున్నాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష నేతలను భయపెట్టేలా చేయడానికి ఇలా చేస్తోంది. వారు జనంలోకి వెళ్లకుండా చేయాలన్న వ్యూహాన్ని అమలు చేస్తోంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో జనవాణి చేయడానికి అంగీకరించలేదు. పవన్ కల్యాణ్‌ను నిర్బంధించి.. విశాఖ నుంచి విజయవాడకు తరలించేశారు. ఇటీవలి కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎక్కడికి వెళ్లినా ఉద్రిక్తతలు చోటుచేసుకుటున్నాయి. నందిగామ పర్యటనలో చంద్రబాబు లక్ష్యంగా విసిరిన రాయి.. సెక్యూరిటీ ఆఫీసర్‌కు తగిలింది. అదే చంద్రబాబుకు తగిలి ఉంటే..? . కొద్ది రోజుల కిందట సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లినప్పుడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడా రాళ్ల దాడులు జరిగాయి.
పోలీసులు భద్రత కల్పించాలి. కానీ .. ఘర్షణలు జరిగేలా చూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల పాదయాత్ర జరుగుతున్న సమయంలో వారికి పోటీగా గర్జనలు నిర్వహించేలా సహకరించారు. ఉద్రిక్తతలకు కారణం అయ్యారు. ఏపీలో ప్రతిపక్ష నేతలకు భద్రత కొరవడిందన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతోంది. ఇది ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వసనీయత తగ్గడానికి కారణం అవుతుంది.