టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విడుదల చేసిన “ఫామ్‌హౌస్ ఫైల్స్” తేలిపోయాయి. దేశం షేకైపోతుంది.. కేంద్రం కదిలిపోతుందని కేసీఆర్, కేటీఆర్ చేసిన ప్రకటనలతో చాలా హైప్ వచ్చింది కానీ బయటకు వచ్చిన వీడియోల్లో ఏమీ లేదన్న అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. జాతీయ స్థాయిలో అసలు ఈ వీడియోలను ఎవరూ పట్టించుకోలేదు. గంటకుపైగా ఉన్న వీడియోలో తెలుగు మీడియాకు కూడా అంత పెద్ద స్టఫ్ కనిపించలేదు. నిజంగా కుట్రలు చేసే వారు అంత వివరంగా మాట్లాడుకోరని.. వారేదో కావాలని చెబుతున్నట్లుగా ఇదంతా చెప్పినట్లుగా ఉందన్న అభిప్రాయం ఎక్కువ మంది వినిపించారు.
ఎవరికీ తెలియని రామచంద్ర భారతి, సింహయాజిలు నేరుగా ఎమ్మెల్యేలను ఎందుంకు కొంటారని ఎమ్మెల్యేలు కూడా ముక్కూముఖం తెలియని వారితో ఎందుకు డీల్ మాట్లాడుకుంటారన్నది ప్రధానంగా వస్తున్న సందేహం. దీంతో ఈ వీడియోలు అనుకున్నంతగా ప్రజల్లోకి వెళ్లలేదు. పాన్ ఇండియాను షేక్ చేసేంత బలం తమ వద్ద ఉన్న సాక్ష్యాలకు ఉందని తేలినప్పుడు.. కేసీఆర్ చట్ట పరంగా నిందితులకు శిక్షపడేలా చేయగలగాలి. కానీ ఎంత డబ్బు దొరికిందో కోర్టుకు చెప్పలేదు. అసలు డబ్బు రికవరీ చేసినట్లుగా పోలీసులు చెప్పలేదు.
ఆడియోలు.. వీడియోలు ముందు న్యాయస్థానానికి ఇవ్వాలి. కానీ ఇవ్వలేదు. స్వయంగా రిలీజ్ చేశారు. చార్జిషీట్ అయ్యే వరకూఇవన్నీ సీక్రెట్ గా ఉండాలి కదా అని హైకోర్టే ..ప్రశ్నించింది. కానీ కేసీఆరే స్వయంగా రిలీజ్ చేశారు. దీంతో న్యాయపరంగా ఆ కేసును బలహీనం చేశారన్న వాదన న్యాయవర్గాల్లో ఉంది. మొత్తం 60, 70వేల పేజీల సమాచారం , ఆరేడేళ్ల కాల్ లిస్ట్ ఉందన్నారు. అది మొత్తం దేశంలోని అందరి న్యాయమూర్తులతో పాటు ముఖ్యమంత్రులకు కూడా పంపానన్నారు. కానీ ఇలా పంపడం ద్వారా ఏమీ జరగదు.
కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన వెంటనే రాజకీయ పునరేకీకరణ పేరుతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలందర్నీ చేర్చుకున్నారు. వారితో రాజీనామాలు కూడా చేయించలేదు. మొదటి సారి టీడీపీని విలీనం చేసుకున్నారు. రెండో సారి గెలిచాక కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకున్నారు. టీడీపీలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేల్నీ చేర్చుకున్నారు. ఎవరితోనూ రాజీనామాలు చేయించలేదు. పైగా ఇతర పార్టీ గుర్తుతో గెలిచిన తలసాని, సబితా వంటివారికి మంత్రి పదవులు ఇచ్చారు. అందుకే కేసీఆర్ వాదనలో సీరియస్ నెస్ తగ్గిపోయిందన్న వాదన కూడా వినిపిస్తోంది.