అల్లు శిరీష్ సాలీడ్ హిట్ ఇవ్వలేదు కానీ.. తన ఖాతాలో డీసెంట్ సినిమాలే ఉన్నాయి. కొత్త జంట, శ్రీరస్తు- శుభమస్తు ఓకే అనిపించాయి. ఇప్పుడు `ఊర్వశివో – రాక్షసివో` కూడా. గమనిస్తే….ఇవి మూడూ గీతా ఆర్ట్స్ లో వచ్చినవే. బయట చేసిన సినిమాలన్నీ శిరీష్‌కి నిరాశాజనకమైన ఫలితాలు అందించాయి. సొంత సంస్థ వల్ల కలిగే లాభమేంటంటే… బడ్జెట్ కోతలుండవు. పేరున్న టెక్నీషియన్స్‌ని తీసుకురావొచ్చు. ప్రచారం బాగా చేసుకోవొచ్చు. వీటి వల్ల సినిమా కళే మారిపోతుంది. `ఊర్వశివో..` ఎప్పుడో సిద్ధమైంది. దానికి చాలా రిపేర్లు చేశారు. ప్రీ రిలీజ్‌కి బాలయ్యని తీసుకొచ్చి హడావుడి చేశారు. పెద్ద సినిమాల తాకిడి లేని సమయం చూసుకొని.. విడుదల చేశారు. ఇంత టైమ్… బయటి నిర్మాణ సంస్థలకు ఉండదు. సినిమా పూర్తయిన వెంటనే… బయటకు వదిలేద్దాం అనుకొంటారు. వాళ్ల బాధలు వాళ్లవి. గీతా ఆర్ట్స్ కాబట్టే శిరీష్‌కి ఇవన్నీ సాధ్యమయ్యాయి. `ఊర్వశివో..`కి మంచి టాక్ వచ్చింది. ఈవారం విడుదలైన సినిమాల్లో దీనికే ఎక్కువ మార్కులు పడ్డాయి కాబట్టి.. వసూళ్లూ బాగానే ఉండొచ్చు. ఈ సినిమాతో శిరీష్ ట్రాక్‌లోకి వచ్చినట్టే. ఇక మీదట తనకు సూటైన కథల్నే ఎంచుకొంటూ ఇలా ప్రయాణం సాగిస్తే.. ఇంకొన్ని డీసెంట్ సినిమాలు శిరీష్ ఖాతాలో పడే ఛాన్స్ ఉంది.