ఇలా కూల్చివేలతో ప్రజల ఆస్తులను నేల మట్టం చేస్తే తాము రాగానే వైసీపీ నేతల ఇళ్లు, ఇడుపులపాయ మీద నుంచి హైవే వేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో పవన్ కల్యాణ్ పర్యటించారు. రోడ్డు విస్తరణ పేరుతో కూల్చివేసిన ఇళ్లను పరిశీలించారు. చిన్న గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో కష్టంతో కట్టుకున్న ఇళ్లను కూల్చివేయడం కిరాతకమన్నారు. మా మట్టిని కూల్చారు.. మీ కూల్చివేత తథ్యమని ప్రకటించారు.
ఇప్పటం గ్రామానికి రాకుండా పోలీసులు అడ్డుకోవడంపై పవన్ మండిపడ్డారు. అత్యాచారాలు చేసిన వారిని వదిలేస్తున్నారు… తమను మాత్రం అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పోలీసులు రాజ్యాంగాన్ని రక్షించాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్నారు. అరెస్టులు చేసినా భయపడబోమన్నారు. దాదాపుగా రెండు గంటల పాటు ఇప్పటంలో పర్యటించి బాధితుల్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అందరికీ అండగా ఉంటామన్నారు. జనసేన సభలకు స్థలం ఇచ్చారన్న కక్షతోనే కూల్చివేతలకు పాల్పడ్డారని.. మార్చిలో సభ నిర్వహిస్తే ఏప్రిల్లో అందరికీ నోటీసులు ఇచ్చారన్నారు.
పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామానికి వెళ్లకుండా అడ్డుకోవడానికి పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. తన పార్టీ ఆఫీసు నుంచి బయటకు వచ్చిన వెంటనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పాదయాత్రగా వెళ్లడానికి సిద్ధమయ్యారు. అయితే కాసేపటికే వాహనాలను పోలీసులు అనుమతించారు. దీంతో వాహనంపై ఇప్పటంకు పవన్ కల్యాణ్ వెళ్లారు. గ్రామం హద్దుల్లోనే ముళ్ల కంచెలు వేశారు. వాటిని దాటుకుని గ్రామంలోకి వెళ్లి బాధితుల్ని పరామర్శించారు.