మునుగోడులో ఎన్నికల ఖర్చుపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. కొత్తగా మద్యం లెక్కలు బయటకు వచ్చాయి. తెలంగాణలో సగటున ప్రతి నెలా రూ. 2700 కోట్ల మద్యం అమ్మకాలు ఉంటాయి. అక్టోబర్లో ఈ లెక్క రూ. మూడు వేల కోట్లు దాటిపోయింది. అదనంగా వచ్చిన ఈ మొత్తం మునుగోడుదేనన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. నిజానికి గత నెలలో దసరా, దీపావళి పండుగలు ఉన్నాయి. దసరా పండుగలకు.. మద్యం అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి. కానీ దసరా గత నెల ఐదో తేదీన వచ్చింది.
దసరా కోసం.. సెప్టెంబర్లోనే మద్యం దుకాణాలు .. స్టాక్ కొనేసుకున్నాయి. ఇదే ప్రభుత్వ లెక్కలోకి వస్తోంది. అంటే దసరా ఖర్చు సెప్టెంబర్ ఖాతాలో పడిందని.. దీపావళి.. మునుగోడు ఎన్నికల్లో తాగిన మద్యం ఖర్చే అక్టోబర్ ఖాతాలో పడిందని అంటున్నారు. మునుగోడులో మద్యం ఏరులై పారిందని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఒక్కో పార్టీ ఆఫీసు దగ్గర… గుట్టలు గుట్టలుగా మద్యం బాటిళ్లు కనిపించిన అంశం సోషల్ మీడ్ియాలో వైరల్ అయింది.
మొత్తంగా అన్ని పార్టీలూ కలిసి రూ. మూడు వందల కోట్ల మద్యాన్ని అక్కడి జనానికి పార్టీ నేతలకు.. కార్యకర్తలకు పంచి పెట్టారు. తాగేలా చేశారని ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఒక్క మద్యం ఖర్చే ఇలా ఉందంటే.. ఇక రాజకీయ పార్టీలు ప్రచారానికి.. ఓట్ల కొనుగోలుకు ఎంత ఖర్చు పెట్టి ఉంటాయో అంచనా వేయడం కష్టం. రాను రాను ఖరీదుగా మారిపోతున్న ఎన్నికల ప్రజాస్వామ్యంలో మునుగోడు మరో చరిత్ర సృష్టించిందని సరి పెట్టుకోవాలి.