చంద్రబాబుపై బలమైన రాళ్లతో దాడి చేశారు. అది చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు తగిలాయి. ఆయనకు గాయాలయ్యాయి. కానీ టార్గెట్ మాత్రం చంద్రబాబు అని స్పష్టంగా తెలుస్తోంది. అదే రాయి చంద్రబాబుకు తగిలి ఉంటే… ?. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిపై ఇలా దాడి జరగడం చిన్న విషయం కాదు. ప్రతిపక్ష నేతపై దాడులు జరగడం … రాష్ట్రంలో అరాచక పాలనకు నిదర్శనం. ఇంత జరిగినా కేసు పెట్టకపోతే.. అలాంటి వ్యవస్థను ఏమనాలి ? . ఆ పని చేసింది అధికార పార్టీ వాళ్లేనని.. పెద్ద కుట్రతోనే చేశారని..ఇందులో పోలీసులు భాగమయ్యారని అనుకోవాలి. ఇప్పటికి అదే జరుగుతోంది.
చంద్రబాబు పై రాయి విసిరిన ఘటన తర్వాత పోలీసులు హడావుడి చేశారు. కామెడీగా … రోడ్ షో త్వరగా ముగించాలని చంద్రబాబుపైనే ఒత్తిడి తెచ్చారు కానీ.. ఆ రాయి వేసిన వాళ్లు ఎవరు అన్నది పట్టించుకోలేదు. సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్లుగా షో చేశారు. తర్వాతి రోజు టీడీపీ నేతలు… వైఎస్ విగ్రహం వద్ద రాళ్లతో నిలబడి ఉన్న ఓ ఎమ్మెల్సీ అనుచరుల ఫోటోలను విడుదల చేశారు. ఆ విగ్రహం వద్ద .. పోలీసు కానిస్టేబుల్ కూడా ఉన్నారు. అయినా అక్కడ్నుంచి గురి చూసి రాళ్లు విసిరారు. కానీ పట్టించుకోలేదు.
గాయపడిన చంద్రబాబు సీఎస్‌వో ఫిర్యాదు చేస్తేనే కేసు పెట్టాలనుకున్నారు. శనివారం మధ్యాహ్నం ఆయన ఫిర్యాదు చేశారు . కానీ కేసులు పెట్టలేదు. గతంలోటీడీపీ ఆఫీసుపై దాడి చేస్తే.. వీడియో సాక్ష్యాలు స్పష్టంగా ఉన్నా ఇంత వరకూ కేసులు పెట్టలేదు. అదే విధంగా టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడి చేసినా కేసులు పెట్టలేదు. ఇలాంటి అరాచక పోలీసు వ్యవస్థ దేశంలో ఎక్కడా ఉండదేమో అనేలా వీరి పని తీరు ఉంటుంది. వందల మంది పోలీసులతో టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం చూశాం కానీ…. సాక్ష్యాలు స్పష్టంగా ఉన్నా.. నిందితుల్ని పట్టకోకపోవడం పోలీసుల స్టైల్.