అర్జున్ వ్యాఖ్యలపై విశ్వక్సేన్ స్పందించారు. అర్జున్ సినిమా నుంచి ఎందుకు బయటకు రావాల్సివచ్చిందో.. ఈ రోజు స్పష్టం చేశారు. `రాజయోగం` అనే ఓ సినిమా టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం ఈ రోజు హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా అర్జున్ కాంట్రవర్సీపై వివరణ ఇచ్చారు. `నేను ప్రొఫెషనల్ కాదని తనతో పని చేసిన ఏ నిర్మాత చెప్పినా, ఆఖరికి సెట్ బోయ్ చెప్పినా ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతా` అని ఉద్వేగంగా వ్యాఖ్యానించారు.
”ప్రతీ సినిమా పనీ.. ఇది నాది అని చెస్తా. ఓ సినిమా చేశాక ప్రమోషన్ కోసం భుజాల మీద వేసుకొని తిరిగాను. నా అంత కమిటెడ్, నా అంత ప్రొఫెషనల్ ఎవడూ ఉండడు. నా వల్ల ఏ నిర్మాతా ఇబ్బంది పడలేదు. రూపాయి పోగొట్టుకోలేదు. నేను చేసింది చిన్న సినిమాలే కావొచ్చు. కానీ నేను పనిచేసింది పెద్ద నిర్మాతలతో. వాళ్లెవరైనా నేను ప్రొఫెషనల్ కాదంటే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతా. అర్జున్ గారిపై చాలా గౌరవంతో ఈ సినిమా ఒప్పుకొన్నా. అన్ని సినిమాల్లానే కలిసి.. పనిచేద్దామనే దిగాను. జర్నీ బాగానే గడిచింది. ఫస్టాఫ్ వచ్చిందే.. షూటింగ్‌కి వెళ్లే వారం ముందు. ‘ఇక్కడ ఇలా బాగుంటుందేమో.. ఇలా చెద్దామా? అలా చేద్దామా’ అని చెప్పేవాడ్ని. కానీ ఆయన వినలేదు. ముందు రోజు వరకూ… చేసేద్దామనే ఫిక్సయ్యా. ఆరోజు కూడా నాలుగింటికి లేచా. కానీ.. ఎందుకో భయం వేసింది. ఎప్పుడూ లేనిది.. ఎందుకు ఇలా భయం వేస్తుంది? అని ప్రశ్నించుకొన్నా. నేను సినిమాని ఆపేద్దామనలేదు. షూటింగ్ కి రానని అనలేదు. కొన్ని మార్పులు చేర్పులూ ఉన్నాయని, చర్చించుకొని ముందుకు వెళ్దాం అనుకొన్నా. కానీ అట్నుంచి సమాధానం రాలేదు. అర్జున్ మేనేజర్ మాత్రం `ఇక మాట్లాడేదేం లేదు.. అడ్వాన్సులు తిరిగి పంపించేయండి` అన్నారు. అప్పటికప్పుడు షూటింగ్ ఆపమని చెప్పడం తప్పే. కానీ నాలుగు రోజుల తరవాత చెబితే… ఇంకా పెద్ద తప్పు కదా..? మర్యాద లేకుండా ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఈ విషయంపై నిన్నే స్పందిద్దామనుకొన్నా. కానీ… ఆయన సినిమాని డామేజ్ చేయకూడదని మౌనంగా ఉన్నా. కానీ.. పొద్దున్నుంచి.. టీవీలో డిబేట్లు పెట్టి నా గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. సెట్లో ఏదైనా తప్పు చేస్తే… చెప్పండి. ఇప్పుడే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా. అర్జున్ గారిని అవమానించాలని ఎప్పుడూ అనుకోలేదు. అలా ఆయన ఫీలై ఉంటే మాత్రం సారీ.. అర్జున్ గారిపై గౌరవంతో చెబుతున్నా.. ఆ సినిమాకి ఆల్ ది బెస్ట్” అని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.