కంచరపాలెంతో ఆకట్టుకొన్న దర్శకుడు వెంకటేష్ మహా. ఆ తరవాత ఉమామహేశ్వర ఉగ్ర రూపశ్య తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాల తరవాత నటుడిగా బిజీ అయ్యాడు. మళ్లీ మెగా ఫోన్ పట్టలేదు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కోసం ఓ కథ రెడీ చేశాడు. ఇటీవల బాలయ్యకు కలిసి కథ మొత్తం చెప్పేశాడు వెంకటేష్. బాలయ్యకు కూడా ఈ కథ బాగా నచ్చిందని సమాచారం. బాలయ్య చిన్న చిన్న మార్పులు సూచించాడని, ప్రస్తుతం మార్పులు – చేర్పులతో వెంకటేష్ బిజీగా ఉన్నాడని టాక్.
కంచరపాలెంలా.. ఇది కూడా ఓ వైవిధ్యభరితమైన కథేనట. బాలయ్య ఈ సినిమాని ప్రయోగాత్మకంగానే చేయాలని భావిస్తున్నాడని సమాచారం. బాలయ్య కెరీర్లో ఇదో కొత్త తరహా సబ్జెక్ట్ అవుతుందని మహా గట్టిగా నమ్ముతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఆ వెంటనే… అనిల్ రావిపూడి సినిమా ఉంటుంది. ఆ తరవాతే… వెంకటేష్ మహా కథ సెట్స్‌పైకి వెళ్తుంది. ఈ సినిమాని 3 – 4 నెలల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడట వెంకటేష్. అందుకే ఏమాత్రం గ్యాప్ వచ్చినా – వెంకటేష్ సినిమా పట్టాలెక్కేసే ఛాన్స్ ఉంది.