ప్రత్యర్థితో.. తనను నిత్యం వ్యతిరేకించేవారితో గౌరవమర్యాదలు పొందడం రాజకీయ నేతలకు కిక్ ఇస్తుంది. రోజా లాంటి దూకుడైన నేతలకు అయితే చెప్పలేనంత ఆనందం లభిస్తుంది. అయితే ఇలాంటి ఆనందం కోసం రోజా చేసిన ఓ ప్రయత్నం ఫెయిల్ అయింది. ప్రోటోకాల్ కూడా ఆమెకు దక్కలేదు . దీంతో ఆమె చిన్న బుచ్చుకోవాల్సి వచ్చింది.
నగరి నియోజకవర్గంలో రోజాకు ప్రతి మండలంలో ప్రత్యర్థులున్నారు. ఆమెకు పార్టీలోనే ప్రధాన ప్రత్యర్థిగా రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఉన్నారు. ఆయనకు వైసీపీ హైకమాండ్ శ్రీశైలం ఆలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పదవి ఇచ్చింది. దీంతో ఆయన కూడా నగరి నియోజకవర్గంలో బలం పుంజుకున్నారు. ఇటీవల రోజా ప్రమేయం లేకుండా నగరి నియోజకవర్గంలో.. ఓ రైతు భరోసా కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ విషయంపై ఆవేదన వ్యక్తం చేస్తూ రోజా మాట్లాడిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది. అదే సమయంలో చక్రపాణి రెడ్డి రోజాను అసలు పట్టించుకోవడం లేదు. ఆయన మంత్రి పెద్దిరెడ్డి వర్గంగా పేరు పొందారు.
ఇప్పుడు చక్రపాణిరెడ్డికి షాక్ఇవ్వాలనుకున్నారో లేకపోతే.. మరో కారణమో కానీ.. మంత్రి హోదాలో రోజా.. శ్రీశైలం అలయానికి వెళ్లారు. ప్రోటోకాల్ ప్రకారం.. మంత్రికి ఆలయ చైర్మన్ స్వాగతం చెప్పాలి. కానీ శ్రీశైలంలోనే ఉన్నప్పటికి స్వాగతం చెప్పడానికి రాలేదు. ఆయన వస్తాడేమో అని రోజా కాసేపు ఎదురు చూసింది. కానీ రాలేదు. దీంతో ఈవోనే లాంఛనంగా స్వాగత కార్యక్రమాలు పూర్తి చేశారు. ఇప్పుడురోజాకు.. ప్రత్యర్థి నుంచి కనసం ప్రోటోకాల్ మర్యాద కూడా దక్కనట్లయింది.
నగరి రాజకీయాలు రోజు రోజుకు రోజాకు కఠినంగా మారుతున్నాయి. ఈ సారి ఆమెకు టిక్కెట్ వద్దని.. మెజార్టీ వైసీపీ క్యాడర్ కోరుతోంది. హైకమాండ్ ఆలోచన ఎలా ఉందో కానీ.. ఈ రాజకీయాలతో రోజాకు టెన్షన్ తప్పడం లేదు.