పవన్ కల్యాణ్ దానం చేయడంలో తనదైన స్టైల్‌ని చూపిస్తున్నారు. ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత బాధితులైన యాభై మూడు కుటుంబాలకు తలా ఓ లక్ష ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే ఇప్పటం గ్రామ అభివృద్ధి కోసం రూ. యాభై లక్షలు ఇచ్చారు. దాంతో వారు కమ్యూనిటీ హాల్ కట్టుకున్నారు. ఆ డబ్బులు పవన్ ఇవ్వలేదంటూ వైసీపీ నేతలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటం గ్రామస్తుల పేరుతో తెల్ల కాగితం పేరుతో రాసిన ఫేక్ లెటర్లను సర్క్యూలేట్ చేస్తున్నారు. ఊరూపేరూ లేని వారితో మాట్లాడిస్తున్నారు. కానీ పవన్ మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. మళ్లీ ఆ గ్రామ ప్రజలకు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు.
పవన్ కల్యాణ్.. ప్రతి ఇంటికి రూ. లక్ష ఇవ్వాలని నిర్ణయించడంతో యాభై మూడు కుటుంబాల వాళ్లూ తలా లక్ష అందుకోనున్నారు. ఇందులో జనసేన వాళ్లు మాత్రమే కాదు.. వైసీపీ వాళ్లు కూడా ఉన్నారు. తమ ఇల్లు కూడా పోయిందంటూ ..కొంతమంది వైసీపీ కార్యకర్తలు.. సాక్షి మీడియాలో సమర్థింపుగా మాట్లాడారు. వారికి నిజంగా ఇళ్లు పోయి ఉంటే.. వారికీ పవన్ లక్ష ఇస్తారు. నిజంగా వారు తొలగింపును సమర్థించి ఉంటే.. పవన్ ఇచ్చే లక్షను తిరస్కరిస్తారు. దీంతో అన్నీ బయట పడిపోతాయి.
ఇప్పటికే పవన్ కల్యాణ్.. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు పెద్ద ఎత్తున సాయం చేస్తున్నారు. కుటుంబానికి రూ. లక్ష చొప్పున ఇస్తున్నారు. ఇలా ఐదారు కోట్ల వరకూ పంచారు. ఇప్పుడు ఇప్పటం గ్రామం కోసమే రూ. కోటి వరకూ ఖర్చు చేస్తున్నారు. ఓ వైపు పార్టీకి తన సినిమాల డబ్బునే వెచ్చిస్తున్నారు. ఇలా సాయానికి తన డబ్బునే వెచ్చిస్తున్నారు. ఎవరికీ పావలా సాయం చేయని వైసీపీ నేతలు మాత్రం పవన్ కల్యాణ్‌ను దూషిస్తూ ఉంటారు.