నోట్ల రద్దు తర్వాత నోట్ల అవసరం పెద్దగా ఉండదని.. డిజిటల్ లావాదేవీలు పెరిగిపోతాయని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు చూస్తే నోట్లు రెట్టింపయ్యాయి. అక్టోబర్ 21, 2022 నాటికి ఆర్థిక వ్యవస్థలో నగదు రూపంలో చలామణిలో ఉన్న నోట్ల విలువ రూ.30.88 లక్షల కోట్లు. నోట్ల రద్దుకు ముందు అంటే.. నవంబర్ 2016లో కేవలం రూ.17.7 లక్షల కోట్లు మాత్రమే జనం దగ్గర ఉన్నాయి. ఆరేళ్లలో నగదు చలామణి 72 శాతం పెరిగింది. ఇలా ఎలా పెరిగిందో… ఇంత పెద్ద స్థాయిలో నోట్లు ఎలా ఇచ్చేశారో కేంద్రానికే తెలియాలి.
నగదు రూప లావాదేవీలపై కేంద్రం కఠిన ఆంక్షలు విధించింది. కేవలం రూ. రెండు లక్షలు లోపు మాత్రమే నగదు లావాదేవీలు జరగాలి. అంత కంటే ఎక్కువ అయితే ఖచ్చితంగా బ్యాంక్ ద్వారానే జరగాలి. తానీ ఆర్థిక వ్యవస్థలో నగదు వినియోగం అనూహ్యంగా పెరిగిపోయింది. నోట్ల రద్దు తర్వాత నోట్ల కొరతతో డిజిటల్ లావాదేవీలు పెరిగాయి… కోవిడ్ సంక్షోభం కారణంగా చిన్న చిన్న బడ్డీ కొట్లలోనూ డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి. కానీ నగదు మాత్రం అంతకంతకూ పెరుగుతోంది.
నోట్లరద్దు నిర్ణయం అట్టర్ ఫ్లాప్ అయిందని ఐర్బీఐ ఈ గణాంకాలు విడుదల చేసిన తర్వాత స్పష్టమయింది. నోట్లరద్దు నిర్ణయాన్ని దేశ, విదేశాల్లోని ఎంతోమంది ఆర్థికవేత్తలు, నిపుణులు వ్యతిరేకించారు. ఇది పూర్తిగా రాజకీయ ఉద్దేశంతో కూడుకున్నదని విమర్శించారు. నల్లధనం, అవినీతి ఎన్నో రెట్లు పెరిగిందేగానీ, తగ్గలేదని నిరూపితమయిందని అంటున్నారు. బ్లాక్ మనీని పకడ్బందీగా వైట్ చేసుకున్నారని.. ఆ ఫలితాల్ని భారత్ ఇప్పుడు అనుభవిస్తోందని అంటున్నారు.