ప్రధానమంత్రి నరేంద్రమోడీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పన్నెండో తేదీన రెండు కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఏపీలో జరిగే కార్యక్రమంలో అక్కడి ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బహిరంగసభ కోసం భారీ ఎత్తున జన సమీకరణ చేస్తోంది. కానీ తెలంగాణలో మాత్రం అధికార పార్టీ తీవ్రమైన వ్యతిరేక కార్యక్రమాలను చేపట్టే అవకాశాలు ఉన్నాయి. గతంలో ప్రధాని మోదీ వచ్చినప్పుడు విభిన్న నిరసనలు చేపట్టారు. ఈ సారి మునుగోడు ఉపఎన్నిక ఉత్సాహంతో మరింత దూకుడుగా వ్యతిరేకత చూపించే అవకాశాలు ఉన్నాయి.
ప్రధాని మోదీపై వ్యతిరేకత చూపించడంలో తమిళనాడు నిరసన కారులది ప్రత్యేక శైలి. నల్ల బెలూన్లు ఎగురువేయడం దగ్గర నుంచి చాలా కార్యక్రమాలు చేస్తారు. సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉంచుతారు. అదే తరహాలో దేశ వ్యాప్తంగా ఆకర్షించేలా టీఆర్ఎస్ కూడా.. తెలంగాణలో మోదీ పర్యటన సందర్భంగా నిరసనలు చేపట్టడం ఖాయమని ఆపార్టీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షా లాంటి నాయకుడు వస్తేనే.. తడిపార్ అంటూ అవమానించేలా పోస్టర్లు వేశారు. వారికి కోపం వస్తుందేమో అని ఏ కోణంలోనూ ఆలోచన చేయడం లేదు. అన్నింటికీ సిద్ధమయ్యారు.
ప్రస్తుతం జాతీయ పార్టీ కావాలనుకుంటున్నారు కాబట్టి…టీఆర్ఎస్ నిరసనలు దేశవ్యాప్తంగా ఆకర్షించాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ .. ఈ విషయంలో పార్టీ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. పన్నెండో తేదీన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రధాని జాతికి అంకితం చేస్తారు. నిజానికి ఇది ఎప్పుడో ఆరు నెలల కిందటే ప్రారంభమయింది. కానీ ఇప్పుడు మోదీకి తీరిక దొరికింది. ఇప్పుడు ఆయన పర్యటనను.. తెలంగాణకు చేస్తున్న అన్యాయంతో ముడిపెట్టి.. టీఆర్ఎస్.. క్రియేటివ్‌గా ప్రధానిపై ఎదురుదాడికి దిగే అవకాశాలు ఉన్నాయి.