గుర్తొచ్చినప్పుడు ఏపీ విభజన సమస్యలపై మీటింగ్లు పెట్టే కేంద్రం.. మళ్లోసారి.. సమావేశం ఏర్పాటు చేసింది. ఎప్పుడు మీటింగ్ జరిగినా ఎలాంటి డెలవప్మెంట్ ఉండదు. అయితే ఈ సారి ఇంకా విచిత్రమైన మీటింగ్ జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఆహ్వానం పంపకుండా.. ఒక్క ఏపీకి మాత్రమే.. సమాచారం ఇచ్చి.. 23వ తేదీన విభజన సమస్యలపై పరిష్కార సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా కేంద్ర హోంశాఖ నుంచి ఏపీ ప్రభుత్వానికి సమాచారం అందింది. తెలంగాణకు మాత్రం ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు.
విభజన సమస్యలపై 23వ తేదీన సమావేశం ఉందని మీడియాలో ప్రచారం జరిగిన తర్వాత తెలంగాణ ప్రభుత్వ వర్గాలు తమను ఎందుకు పిలవలేదని ఆరా తీసినట్లు సమాచారం. అయితే కేంద్రానికి తెలంగాణ అడిగిన సమాచారం ఇవ్వలేదని.. అందుకే పిలువలేదని చెబుతున్నారు. విభజన సమస్యల పరిష్కారం కోసం.. తమ సమస్యలూ అంటూ తెలంగాణ ఎలాంటి అంశాలను అప్డేట్ చేయక పోవడంతోనే రాష్ట్రానికి సమాచారం ఇవ్వలేదనే చర్చ తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతోంది.
తెలంగాణ అధికారులు విభజన భేటీకి హాజరయ్యేది సందేహంగా మారింది. పెండింగ్లో ఉన్న విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాలతో సెప్టెంబరు చివర్లో కేంద్ర హోం శాఖ సమావేశం నిర్వహించింది. ఎప్పుడు సమావేశం జరిగినా రైల్వే జోన్, రాజధాని నిర్మాణానికి అదనంగా నిధుల, ఏడు వెనకబడిన జిల్లాలకు రూ.50 కోట్ల చొప్పున కేంద్ర గ్రాంట్ల రూపంలో ఆర్థిక సాయం, రెవెన్యూ లోటు భర్తీకి ఇచ్చే సాయం వంటి అంశాలను ఏపీ అడుగుతూ ఉంటుంది. అలాగే తెలంగాణ నుంచి రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ బకాయిలు.. ఇతర అంశాలపైనా చర్చ జరుగుతుంది.
ఇలాంటి మీటింగ్ల వల్ల ఉపయోగంలేదని.. తెలంగాణ అనుకుంటుందేమో కానీ.. సమావేశాలకు హాజరవడానికి ఆసక్తి చూపడం లేదు. వివరాలు అప్ డేట్ చేయకపోతే.. మొత్తంగా ఏపీ ఒక్క రాష్ట్రమే విభజన సమస్యలపై చర్చకు హాజరయ్యే అవకాశం ఉంది.