విశాఖలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. అక్కడి ప్రజలు తమ ఇల్లు ప్రభుత్వ భూమిలో ఉందని ఎప్పుడు కూల్చివేస్తారో అని భయం భయంగా బతుకుతున్నారు. తాజాగా ఏయూ భూములు అంటూ..రాత్రికి రాత్రి కొంత మంది ఇళ్లు, దుకాణాలను నేలమట్టం చేశారు. ఈ ఘటన కలకలం రేపుతోంది. ఎందుకంటే ఆ భూములు వారివేనని.. చాలా ఏళ్ల క్రితమే సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. నలభై, యాభై ఏళ్ల నుంచి వారు అక్కడే ఉన్నారు. వివాదాల్లో ఉండటంతో సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. చివరికి అక్కడ ఉన్న వారికే అనుకూలంగా తీర్పు వచ్చింది.
కానీ వీసీ ప్రసాదరెడ్డి మాత్రం ఆ భూములు ఏయూవేననడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పి రాత్రికి రాత్రి బుల్డోజర్లను ప్రయోగించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ధిక్కరించి మరీ ఇలా చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. దసపల్లా భూములు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి.. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని .. అమలు చేయకపోతే ధిక్కరణ అవుతుందని వాదించారు విజయసాయిరెడ్డి. అందుకే భూములు ఇచ్చేశామన్నారు. ఆ తర్వాత ఆ భూములను డెలవప్మెంట్కు ఆయనకు చెందిన బినామీ సంస్థనే తీసుకుందని గగ్గోలు రేగింది. అది ఇంకా జరుగుతోంది. కానీ ఇప్పుడు అదే సుప్రీంకోర్టు ఎప్పుడో ఇచ్చిన తీర్పును సైతం ఉల్లంఘించి..ఇప్పుడు ఇలా కూల్చివేతలు చేపట్టడం ఏమిటనేది ఇతరులు వేస్తున్న ప్రశ్న.
తమకు కావాల్సి వస్తే సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నట్లుగా ప్రకటించడం.. లేకపోతే.. తీర్పును సైతం పట్టించుకోకుండా పేదలను ఖాళీ చేయించడం.. అన్నట్లుగా వైసీపీ నేతల తీరు ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏయూ భూములపై వైసీపీ పెద్దల కన్ను పడిందన్న ప్రచారం కొన్నాళ్లుగా సాగుతోంది. ఒక్క ఏయూ భూముల్లోనే కాకుండా.. వైజాగ్లో కూల్చివేతుల పెద్ద ఎత్తున సాగాయి. ప్రతీ వారాంతంలో ఎవరికో ఒకరివి కూల్చివేతకు వెళ్లడం.. తర్వాత వారికి సంబంధించిన ఆస్తులను రాయించుకోవం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తం ప్రభుత్వం చేస్తున్న పనులతో.. ప్రజల్లో తమ ఆస్తులు తమకు ఉంటాయో ఉండవోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.