తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఇంటి తాళాలు పగులగొట్టి మరీ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఆయనతో పాటు ఆయన సోదరులు.. ఆయనతో వ్యాపార సంబంధాలు ఉన్న వారందరూ ఈడీ, ఐటీ టార్గెట్ అయ్యారు. కరీంనగర్‌లోనే కాకుండా.. తెలంగాణలో గ్రానైట్ మైనింగ్ బిజినెస్‌లో గంగుల కమలాకర్ కుటుంబానికి పెద్ద ఎత్తున ప్రమేయం ఉంది. ఈ గ్రానైట్ ఎగుమతుల్లో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడినట్లుగా చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఎనిమిది సంస్థలకు చాలా రోజుల కిందటే ఈడీ నోటీసులు ఇచ్చింది. వాటికి సమాధానం ఇచ్చినా ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. హఠాత్తుగా ఐటీ, ఈడీ అధికారులు రంగంలోకి దిగడంతో గంగుల వర్గం షాక్ అయింది.
గంగుల టార్గెట్‌గా ఈడీ, ఐటీ సోదాలు జరుగుతాయని ఎవరూ ఊహించలేకపోయారు. కేంద్ర బృందాలతో .. ఒక్క సారిగా హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు వెళ్లిన బృందాలు సోదాలు చేశాయి. మొత్తంగా హైదరాబాద్‌తో పాటు కరీంనగర్లో 30 బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. కరీంనగర్లో గంగుల ఇంట్లో సోదాలకు వెళ్లిన సమయంలో ఆ ఇంటికి తాళం వేసి ఉంది. గంగుల కమలాకర్‌ను పిలిపించేందుకు ఈడీ అధికారులు ప్రయత్నించారు. ఆయన కానీ.. ఆయన కుటుంబసభ్యులు కానీ స్పందించకపోవడంతో తాళాలు పగుల గొట్టి సోదాలు చేశారు.
ఇటీవలి మునుగోడు ఉపఎన్నికలు, ఫామ్ హౌస్ ఫైల్స్ విషయాల తర్వాత ఇక బీజేపీ .. టీఆర్ఎస్ నేతల విషయంలో దూకుడుగా ఉండొచ్చన్న ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లుగానే పాత ఆరోపణల్లో గంగుల కమలాకర్‌ను టార్గెట్ చేశారు. కరీంనగర్ గ్రానైట్ మాఫియా అక్రమాలపై చాలా ఏళ్ల నుంచి ఆరోపణలు ఉన్నాయి. వారు బీజేపీకి కూడా పెద్ద ఎత్తున ఫండింగ్ చేస్తారని చెబుతారు. కానీ ఇప్పుడు రాజకీయం మారిపోయింది. అందుకే.. గంగుల ఇంట్లో సోదాలు సంచలనం రేపుతున్నాయి.