ప్రధాని పర్యటన ఖరారైన దగ్గర్నుంచి రైల్వేజోన్ కు శంకుస్థాపన అంటూ హడావుడి చేశారు విజయసాయిరెడ్డి. సోషల్ మీడియాలో డప్పు కొట్టారు. నిజానికి ఆయనకూ తెలుసు.. జోన్ శంకుస్థాపన లేదని. కానీ చేయబోయే రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులనే జోన్‌గా నమ్మించాలని ఉత్తరాంధ్ర ప్రజలు నమ్మేస్తారని ఆయన అనుకున్నారు. సోషల్ మీడియాలో.. సాక్షి మీడియాలో తాము చేసే ప్రచారాలను ప్రజలు ముందూ వెనుకా చూసుకోకుండా నమ్మేస్తారని వారు గట్టిగా అనుకుంటున్నారు. అందుకే చెలరేగిపోయారు.
ఇప్పుడు మోదీ పర్యటనకు ఒక్క రోజు ముందు మొత్తం షెడ్యూల్ ఖరారైంది. అందులో జోన్ అనే మాటే లేదు. అంతే కాదు.. బోగాపురం ఎయిర్ పోర్టుకూ శంకుస్థాపన చేయడం లేదు. అటు జోన్ లేదు.. ఇటు ఎయిర్ పోర్టు లేదు.. మరి రాష్ట్రానికి.. ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి మేలు జరుగుతున్నట్లు.. కేంద్రం నుంచి ఎలాంటి ప్రయోజనాలు తీసుకు వస్తున్నట్లు ?. అత్యధిక ఆదాయం తెచ్చి పెట్టే రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేసే ప్రణాళికల్లో భాగంగానే కొత్త రైల్వే స్టేషన్ కడుతున్నారు. ఇతర కేంద్ర ప్రాజెక్టులు కడుతున్నారు. కానీ రాష్ట్రం ఏం చేస్తుందనేది మాత్రం ఎవరికీ తెలియదు.
కానీ రాజకీయంగా మోదీని ఆకట్టుకోవడానికి .. పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. భారీగా ఖర్చు పెట్టి.. ప్రతి నియోజకవర్గం నుంచి నేతలకు టార్గెట్లు పెట్టారు. ఉదయం పది గంటలకల్లా బహిరంగసభ ప్రదేశంలో లక్షల మందిని కిక్కిరిసిపోయేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ నేతలకు కష్టం లేకుండా వైసీపీనే ఈ బాధ్యత తీసుకుంది. కానీ ఉత్తరాంధ్రకు.. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల విషయంలో కిక్కురుమనడం లేదు. కొసమెరుపేమిటంటే.. రైల్వేజోన్ రాకపోతే రాజీనామా చేస్తానంటూ విజయసాయిరెడ్డి కొద్ది రోజుల కిందట సవాల్ చేశారు . ఇప్పుడు ప్రధాని ఏపీకి వచ్చినా శంకుస్థాపన చేయలేదంటే ఇక జోన్ రాదనేగా..?మరి ఎందుకు రాజీనామా చేయరు ?