టీ 20 ప్రపంచకప్‌లో భారత్ పోరాటం ముగిసింది. సెమీ ఫైనల్లో ఇండ్లంగ్ పై 10 వికెట్ల తేడాతో ఓడిపోయి… ఇంటి ముఖం పట్టింది ఇండియా. ఆటలో గెలుపు ఓటములు మామూలే. కానీ దారుణ పరాజయాలే.. అభిమానుల్ని కృంగదీస్తుంటాయి. 169 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా… భారత బౌలింగ్ ని చీల్చి చెండాడడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సమీ, భుమనేశ్వర్, అక్షదీప్, అక్షర్ పటేల్, అశ్విన్.. ఇలాంటి టీ 20 స్పెషలిస్టులు ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయకపోవడం అటుంచితే.. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ని కనీసం ఇబ్బందికి గురిచేసే బంతులు కూడా వేయలేకపోయారు. పిచ్ బ్యాటింగ్ కి అనుకూలిస్తుందే అనుకొందాం.. ఇదే పిచ్‌పై భారత ఓపెనర్లు పరుగులు రాబట్టడానికి ఎందుకు ఇబ్బంది పడ్డారు? ఇంగ్లండ్ పేస్ ఎటాక్ పవర్ ప్లేలో నిలకడగా బంతులు ఎలా వేయగలిగింది? పిచ్ బౌలింగ్ కీ అనుకూలంగా ఉంది. కాకపోతే మన బౌలర్లే తేలిపోయారు.
భువనేశ్వర్ ఈమధ్య అస్సలు ఫామ్ లో లేడు. ముఖ్యంగా టీ 20లో ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. మరో పేసర్ లేకపోవడం, బుమ్రా అందుబాటులో లేకపోవడంతో భువనేశ్వర్ ని తప్పక తీసుకోవాల్సివస్తోంది. సమీ ఈ వరల్డ్ కప్ లో బాగానే ఆడాడు. కానీ కీలకమైన సెమీస్‌లో తన ప్రతాపం చూపించలేకపోయాడు. ఇక అక్షర్ పటేల్ బౌలింగ్ పేలవంగా తయారైంది. తను బంతికి స్పిన్ చేయడమే మర్చిపోయాడు. ఇక అశ్విన్ అనుభవంతా ఏమైపోయిందో అర్థం కాలేదు.
నిందంతా బౌలింగ్ పైనే వేయలేం. భారత బ్యాటింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. భారమంతా కోహ్లీ, సూర్య కుమార్లే మోస్తున్నారు. కోహ్లీ ఈ రోజూ బాగా ఆడాడు. కానీ సూర్య కుమార్ త్వరగా అవుట్ అవ్వడంతో భారత్ భారీ స్కోరు నమోదు చేయలేకపోయింది. ఓపెనర్ రాహుల్ మరోసారి విఫలం అవ్వడం, రోహిత్ తన సహజసిద్ధమైన ఆట తీరు ప్రదర్శించకపోవడం, పవర్ ప్లేలో భారీగా పరుగులు రాబట్టకపోవడం.. ఇలా భారత ఓటమికి చాలా కారణాలే ఉన్నాయి. కాకపోతే… టీ 20లో 168 పరుగులు అంటే కాపాడుకొనే స్కోరే. కనీసం గట్టి పోటీ ఇవ్వొచ్చు. కానీ పేలవమైన భారత బౌలింగ్ తో మ్యాచ్ కాస్త వన్ సైడ్ అయిపోయింది.