“ప్రశ్నించలేని ప్రజలు, ప్రజాపక్షాలు, ప్రతిపక్షాలు ‘ప్రజాస్వామ్యానికి’ అత్యంత ప్రమాదకరం… భారత రాజ్యాంగానికీ, ప్రజలకూ, దేశానికీ ఎంతో హానికరం” .. ఎంత హానికరమంటే ఇప్పుడు ఏపీ దుస్థితిని చూస్తే తెలిసిపోతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ పర్యటనకు వస్తూంటే.. సంబరాలు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వమే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్వాగతాలు చెబుతోంది. ఆయన తమ పార్టీ నేతే అన్నట్లుగా విశాఖ మొత్తం ఫ్లెక్సీలతో నింపేసింది. రూ. పదిహేను వేల కోట్ల అభివృద్ధి పనులంటూ హడావుడి చేస్తోంది. కానీ.. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై మాత్రం స్పందించలేదు. అధికారపక్షమే కాదు.. ప్రజలు.. ప్రతిపక్షాలు.. ప్రజాపక్షాలు.. అన్నీ సైలెంట్‌గా ఉన్నాయి. దేశంలో అందరి కంటే ఎక్కువ అన్యాయమైపోయిన రాష్ట్రం ఏపీ. కేంద్రం వల్ల ఎక్కువ మోసపోయిన రాష్ట్రం ఏపీ. కేవలం మాటలు చెప్పి.. నట్టేట ముంచేసిన రాష్ట్రం ఏపీ. అయితే ఒక్కరూ ప్రశ్నించడం లేదు. అందుకే.. తాము ముంచలేదని..వారే మునిగిపోయారని లైట్ తీసుకుంటోంది కేంద్రం. దీనికి బాధ్యతలెవరు .. ప్రశ్నించడం చేతకానికి పార్టీలదా ? వారి మత్తులో మునిగిపోయి రాష్ట్రం ఏమిచ్చింది అనే కానీ.. రాష్ట్రానికి తామేమిచ్చామని చూసుకోని ప్రజలదా ? వారిని అలా తయారు చేసిన పార్టీలదా అన్నది పక్కన పెడితే.. ఇప్పుడు రాష్ట్రం మాత్రం పూర్తిగా చేవచచ్చిపోయింది.
ఏపీకి జరుగుతున్న అన్యాయం ఇంతింత కాదు !
ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ఏపీని పూర్తిగా గాలికొదిలేశారు. లోటుబడ్దెట్తో ప్రారంభమైన రాష్ట్రం.. నిలదొక్కుకునేంతలోనే కాడి వదిలేశారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయింది. రాజధాని లేదు. వెనుకబడిన జిల్లాలకు నిధులు లేవు. మౌలిక సదుపాయాల్లేవు. రైల్వే ప్రాజెక్టులు లేవు. రైల్వే జోన్ లేదు. ఇలా చెప్పుకుంటూ.. పోతే అసలు ఏపీని కేంద్రం లెక్కలోకి తీసుకోవడం మానేసిందని అనుకోవాలి. అంతకు మించి ప్రత్యేకహోదా. ఇదే మోదీ.. తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి పోటీ చేస్తూ.. ఊరూరా ఎన్నికల ప్రచారం చేసి.. ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చారు కానీ ఇవ్వలేదు. ఇప్పుడు పూర్తిగా మర్చిపోయారు. కానీ ఇప్పుడు ప్రశ్నించే వారు కూడా లేరు. నాలుగేళ్ల పాటు ప్రశ్నించినా.. తర్వాత రాజకీయ పార్టీలు వారినీ రాజకీయంగా ఉపయోగించుకుని.., తర్వాత నోరెత్తకుండా చేశాయి. ఇప్పుడు ప్రత్యేకహోదా కాదు కదా.. ప్రత్యేక ప్యాకేజీ నిధులు కూడా అడిగేవారు లేరు. కాస్త అప్పిస్తే చాలనుకునే స్థితికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసింది. ఎంతోమంది త్యాగాలతో ఏర్పడి రాష్ట్రంలోనే అతిపెద్ద స్టీలుప్లాంటుగా ఉన్న విశాఖ ఉక్కుకర్మాగారాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తుంటే పాలకులుగానీ, ప్రతిపక్షంలో ఉన్న టిడిపిగానీ కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు. విభజన హామీల్లో పేర్కొన్న ఒక్క అంశాన్నీ అమలు చేశామని చెప్పుకునే పరిస్థితిలో కేంద్రం లేదు, న్నారు. దీనిని ప్రశ్నించకుండా వైసిపి, టిడిపి నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తూంటే రాష్ట్ర ప్రభుత్వం వైపునుండి కనీస డిమాండ్లు కూడా పెట్టలేదు సరి కదా.. ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇంతకంటే దురదృష్టం మరొకటి ఉండదు. రామాయపట్నం పోర్టు, కడప స్టీలు ఫ్యాక్టరీలకు అతీగతి లేదు. వీటికి అప్పట్లో చంద్రబాబు, ప్రస్తుతం జగన్మోహన్రెడ్డి శంకుస్థాపనలు చేశారని, అయినా కేంద్రాన్ని అడిగే పరిస్థితి లేకపోవడంతో ఒక్క అడుగూ ముందుకు పడలేదు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజలపై వైసిపి ప్రభుత్వానికి ఏ మాత్రం గౌరవం ఉన్నా ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ ఉక్కు పరిరక్షణపై ప్రశ్నించేందుకు విశాఖలో మోదీ పర్యటనను వేదిక చేసుకోవాల్సి ఉంది. కానీ అలాంటి చేవచచ్చిపోయింది.
ప్రధాని మోదీ ఎదుట బానిసత్వం చూపిస్తున్న అధికార పార్టీ !
ప్రత్యేక హోదా, విభజన హామీలను తుంగలో తొక్కి, చట్టబద్ధంగా రావాల్సిన హక్కులను సైతం రద్దు చేసి, రాష్ట్రానికి ప్రధాని మోడీ వెనుుపోటు పొడిచి విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారు. మోడీ ప్రధాని అయినప్పటి నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క మంచి పనిచేయలేదు. విశాఖ సభ సందర్భంగా వైసిపి చేస్తును హడావుడి చూస్తుంటే ప్రధాని వైసిపినా లేక వైసిపి బిజెపిలో కలిసిపోయిందా? అనే అనుమానం ఎవరికైనా కలుగుతుంది. దేశంలో ఎక్కడా ప్రజల ఆదాయంతో ప్రధాని బహిరంగ సభలు జరగలేదు. దీనికి భిన్నంగా విశాఖలో ప్రభుత్వ ఖజానా నుండి సొమ్ము వెచ్చించి బహిరంగసభ నిర్వహిస్తున్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం ఒరగబెట్టిందని ఈ హడావుడి చేస్తున్నారో కానీ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల సొమ్మును ఖర్చు పెడుతున్నారన్న అభిప్రాయం మాత్రం ఎక్కువగా వినిపిస్తోంది. రైల్వే జోన్ వస్తుందని గత కొంతకాలంగా ప్రచారం చేశారు. రాష్ట్ర హక్కుల కోసం, విభజన హామీల కోసం, విశాఖపటుం స్టీలు ప్లాంటును కాపాడుకోవడం కోసం, ప్రత్యేక హోదాకోసం బహిరంగ సభలో ప్రధాన మంత్రికి అప్పీలు చేయడానికి ఏపీ ప్రభుత్వం ఏ మాత్రం సిద్ధంగా ఉండే అవకాశం లేదు. అధికార పార్టీ నాయకులు.. పోలవరానికి నిధులివ్వకపోయినా స్పందించడం లేదు. అమరావతి గురించి పట్టించుకోరు. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు ఇవ్వకపోయినా లైట్ తీసుకుంటారు. రాజకీయ. ప్రయోజనాల విషయంలో మాత్రం పరస్పర సహకారం పొంది.. అదే్ పెద్ద ప్రయోజనం అన్నట్లుగా ప్రజలకు చెబుతున్నారు. కేసులు.. ఇతర విషయాల్లో ప్రయోజనాలు పొంది.. అదే ప్రత్యేకహోదా అన్నట్లుగా నమ్మిస్తున్నారు. ఈ రాజకీయంలో రాష్ట్రం బలైపోతోంది.. అధికార పార్టీ లాభం పొందుతోంది. ప్రజలు అంతిమంగా నష్టపోతున్నారు.
ప్రశ్నించడానికి వణికిపోతున్న ప్రతిపక్ష పార్టీలు !
ప్రతిపక్షాల, ప్రజాపక్షాల, రాజకీయ పార్టీల వైఫల్యమే ఇలాంటి సమస్యలకు మూలకారణం అనిపించింది… ప్రతిపక్షాలు, ప్రజపక్షాలు, రాజకీయ పక్షాల పాత్ర ప్రజాస్వామ్యంలో నామమాత్రమైనప్పుడు ఇలాంటి సమస్యలు ఇలా ఎంతో ఎక్కువవుతాయి, పెద్దవవుతాయి… ఎలాంటి రాజకీయ చైతన్యం లేని, ప్రజా సమస్యలపట్ల చైతన్యం, అవగాహనహనా లేని పార్టీల వల్ల, నేతలవల్ల, నాయకులవల్ల ప్రతిపక్షాల, రాజకీయపక్షాల పట్ల ప్రజల్లో విశ్వసనీయత, నమ్మకం తగ్గిపోతాయి… ప్రతిపక్షాలు చొరవతీసుకుని ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి… ఇప్పుడు దురదృష్టవశాత్తూ ఏపీలో కేంద్రాన్ని … కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించే ఒక్క పార్టీ కూడా లేదు. ఇలాంటివన్నీ ముందే ఊహించే రాజ్యాంగనిర్మాతలు, అసలు భారత రాజ్యంలో, రాజ్యాంగంలో ఆశించిన ప్రతిపక్షం పాత్ర ఏమిటి అంటే… ప్రతిపక్షాల ప్రధాన పాత్ర ‘ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజలకు జవాబుదారీగా ఉంచడం’… ఇది ఆధిపత్య/రూలింగ్/పాలక పార్టీ తప్పులను నిలదీయదానికే పరిమితంకాక, పరిష్కరించడానికి కూడా సహాయపడాలి అని నిర్వచించారు. కానీ ఇప్పుడు రాజ్యాంగం గురించి గొప్పగా చెప్పుకోవడానికే కానీ అవసరానికి తగ్గట్లుగా అర్థాలు తీసుకుని తాము రాజ్యాంగాన్ని పాటిస్తున్నామని అంటున్నారు. రాష్ట్ర ప్రజల, రాష్ట్ర విశాల ప్రయోజనాల విషయాల్లో ప్రతిపక్షాలు కూడా ధ్యత వహించాలి… అలాంటి సందర్భాలలో, చిల్లర రాజకీయాలకు పాల్పడకుండా చాలా హుందాగా వ్యవహరించాలి…ప్రతిపక్షాలపై ప్రభుత్వం కూడా ఆధారాలు లేకుండా విద్వేషాలతో ఎటువంటి ప్రతీకార చర్యలు తీసుకోకుండా చూసుకోవాలి… ఇలాంటి చర్యలు దేశ ప్రజలపై, ప్రజాస్వామ్యంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి… ఇప్పుడదే ప్రమాదం భారత ప్రజాస్వామ్యంలో కనిపిస్తోంది. ప్రతిపక్షాలను నిర్మూలించడానికి అధికార పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రజలు సైలెంట్‌గా ఉంటున్నారు.
అచేతనంగా కనిపిస్తున్న ప్రజలు – రాజకీయ పార్టీలదే పాపం
ప్రశ్నించలేని ప్రజలు, ప్రజాపక్షాలు, ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం… భారత రాజ్యాంగానికీ, ప్రజలకూ, దేశానికీ ఎంతో హానికరం… కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రాల్లోనూ, కేవలం అసెంబ్లీల్లోనే కాదు, భారత పార్లమెంట్లో కూడా ఎన్నో సందర్భాల్లో పార్టీలను, నేతలను గొంతెత్తకుండా, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ ప్రజాస్వామిక ప్రమాణాలను కూడా పాటించకుండా, రాజ్యాంగాన్ని కూడా విస్మరించి, ప్రతిపక్షాలను పూర్తిగా అదుపుచేసి, నిర్మూలించి, నశింపచేస్తున్నారు… వారు అనుకున్నవి సాధించుకొంటున్నారు. దేశంలో ప్రజల ఆందోళనకు బలమైన స్వరాన్ని ఇచ్చే నాయకులూ, పార్టీలు, ప్రజలు, మేధావులు, ప్రతిపక్షాలూ, ప్రజాపక్షాలూ లేకపోతే ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడే ప్రమాదం ఎల్లపుడూ పొంచివుంది… ఉంటుంది…
దేశంలో ఎవరైనా ఎక్కడైనా విజయం సాధించినా, ఏమాత్రం నిలదొక్కుకున్నా, ఏ నేత అయినా ఏ పార్టీ అయినా బలపడినా ఆ నేతల్ని, ఆ పార్టీని సమూలంగా సామ, దాన, బేధ, దండోపాయాలతో ఆర్థిక మూలాలు కూడా దెబ్బతీసి మరీ నిర్మూలించే రాజకీయ విధానాలు ఈరోజుల్లో దేశవ్యాప్తంగా అమలవుతున్నాయనే వార్తలు తరచూ వింటున్నాము… ఇదే నిజమైతే, ప్రజాస్వామ్యానికీ, ప్రజలకూ నిజంగా ఇది ఎంతో గడ్డుకాలం… కష్టకాలం… ఎక్కువశాతం అన్నిపార్టీల్లోనూ కుటుంబ నాయకులూ, ఆశ్రితులూ, వందిమాగధులు, చెంచాలు, భజనపరులు, భట్రాజులు తప్ప బలమైన, సమర్థవంతమైన రాజకీయ నాయకత్వం ఇప్పుడు లేదు… ఇవాళ దేశంలో ధీటైన నాయకులూ, ప్రతిపక్షం అంటూ లేని పరిస్థితి ఏర్పడింది… ఇది ప్రజాస్వామ్యానికి, ప్రజలకూ ఏమాత్రం మంచిది కాదు సరైన ప్రతిపక్షం, ప్రశ్నించే ప్రజలు, ప్రజాపక్షాలు లేకపోతే ప్రజాస్వామ్యం ఖచ్చితంగా వ్యక్తిస్వామ్యం వైపు ‘భజన’స్వామ్యం ద్వారా రాజకీయ’చెంచా’స్వామ్యంగా మారి క్రమంగా నియంతృత్వంగా రూపుదిద్దుకునే ప్రమాదం ఎంతైనా వుంది.
ప్రజలు, ప్రతిపక్షాలపై అణిచివేత.. నియంతృత్వానికి మార్గం !
ప్రజాస్వామ్యంలో ప్రజలే కీలకం. వారి మద్దతు లభిస్తుందనుకుంటే.., రాజకీయ పార్టీలు పోరాటం చేస్తాయి. కానీ ఏపీలో ప్రతిపక్ష పార్టీలు రాజకీయం కోసమే పోరాటాలు చేస్తున్నాయి. ప్రజా ప్రయోజనాల కోసం చేయడం లేదు. ఈ విషయంలో ప్రజల స్పందనలు తేడాగా ఉండటమే కారణం అనుకోవచ్చు. కేంద్రంతో పెట్టుకుంటే ఎక్కడ లేని పోని కేసులతో తంటాలు పడాలో అని ప్రతిపక్షాలు సైలెంట్‌గా ఉంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వమే అణణిచివేతకు చట్టాలను ఉల్లంఘిస్తూంటే.. ఇక కేంద్రం కూడా చేయికలిపితే.. తాము ఎదుర్కోలేమని రాజకీయ పార్టీలు కేంద్రంపై సైలెంట్‌గా ఉంటున్నాయి. కేంద్రంపై పోరాడుతున్న పార్టీలు.. సందర్భం.. తప్పనిసరి.. రాజకీయంగా అవసరం అనుకున్నప్పుడే పోరాడుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ అయినా.. గతంలో ఏపీలో టీడీపీ అయినా బాగున్నప్పుడు మౌనంగానే ఉన్నారు.. బీజేపీతో చెడిన తర్వాత రంగంలోకి దిగి.. పోరాటం కలరింగ్ ఇచ్చారు. కానీ ప్రజలు విశ్వసించలేదు. ప్రజల్ని నమ్మించలేకపోయారు. ఎందుకంటే ప్రతిపక్షాల పోరాటంలో విశ్వసనీయత లేదు.త ప్రజల్లో ఈ పోరాటభావం తగ్గిపోవడాని రాజకీయ పార్టీలే కారణం. వారి స్వార్థం కోసం ఎప్పటికప్పుడు విధానాలు మార్చుకుంటూ ప్రజల్ని వెర్రి వాళ్లను చేశారు. ఫలితంగా ఇప్పుడు సమాజం అచేతనమయింది. ప్రశ్నించలేకపోతోంది.