అరబిందో ఫార్మా షేర్ ధర గురువారం రోజు పదకొండున్నర శాతం పడిపోయింది. ఓ దశలో పధ్నాలుగు శాతం వరకూ పడింది. ముగిసింపులో కాస్త కోలుకుంది. గురువారం ఒక్క రోజే ఆ సంస్థ మూడున్నర వేల కోట్ల వరకూ మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది. దీనికి కారణం ఆ సంస్థ డైరక్టర్ శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ కావడమే. అయితే ఈ ఒక్క కారణంతోనే సంస్థ షేర్ పడిపోయిందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే.. గత ఏడాదిగా అరబిందో షేర్ నేల చూపులు చూస్తోంది. ఏడాది కిందట రూ. 900 ఉన్న షేర్ ధర ఇప్పుడు రూ. 470కి అటూ ఇటూగా ఉంటుంది. ఏదో ఓ కారణంగా తగ్గితే సరే అనుకోవచ్చు.. కానీ ఏడాదిగా నిరాటంకంగా పడిపోతూ వస్తోంది.
అరబిందో ఫార్మాను నిత్యానందరెడ్డి, పెనాక రామ్ ప్రసాద్ రెడ్డి మాడున్నర దశాబ్దాల కిందట ప్రారంభించారు. ఫార్మా రంగంలో దిగ్గజంగా ఎదిగింది. వందకుపైగా దేశాలకు ఎగుమతులు ఉన్నాయి. కానీ ఇటీవలి కాలంలో సంస్థకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెనాక రామ్ ప్రసాద్ రెడ్డికి ఇద్దరు కుమారుడు పెద్ద కుమారుడు శరత్ చంద్రారెడ్డి .. మరో వ్యవస్థాపకుడైన నిత్యానందరెడ్డి కుమార్తెను వివాహం చేసుకున్నారు. మరో కుమారుడు రోహిత్ రెడ్డి .. విజయసాయిరెడ్డి కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. వైఎస్ అధికారంలో ఉన్న సమయంలో అరబిందో ప్రభుత్వం నుంచి పలు రకాల ప్రయోజనాలు అక్రమంగా పొందడంతో సంస్థకు చెడ్డపేరు రావడం ప్రారంభమయింది. ఆ తర్వాత శరత్ చంద్రారెడ్డి కూడా జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కున్నారు. వాయిదాలకు తిరుగుతున్నారు. ఇప్పుడు ఏకంగా అరెస్టయ్యారు.
అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్న కంపెనీకి .. ఇలా మరకలు పడటం వల్ల ఇమేజ్ తగ్గిపోతూ వస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి రెడ్డీస్ ల్యాబ్స్ లాంటి అంతర్జాతీయ సంస్థ ఉన్నా ఆ సంస్థపై ఎప్పుడూ వివాదాలు లేవు. ఇమేజ్ కూడా మచ్చ రాలేదు. కానీ అరబిందోకు మాత్రం మంచి ట్రాక్ రికార్డు ఉన్నా.. రాజకీయ నాయకుల సాన్నిహిత్యంలో పడి మొదటికే మోసం తెచ్చుకుంటోంది. శరత్ చంద్రారెడ్డికి అరబిందో ఫార్మాతో సంబంధం లేదని ఆ సంస్థ ప్రకటించి తప్పు దిద్దుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొన్ని వేల మంది ఉద్యోగుల భవిష్యత్తో ముడిపడి ఉన్న పరిశ్రమ అరబిందో. ఈ విషయంలో యాజమాన్యం మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. ఎందుకంటే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీగ లాగితే ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికే తెలుగువారి ప్రైడ్ గా భావించిన సత్యం కంప్యూటర్స్.. ఇలా భూములు.., రియల్ ఎస్టేట్ మాయలో పడి.. అంతర్థానం అయింది. సత్యం రామలింగరాజు గొప్ప స్థాయి నుంచి దిగజారిపోయారు. అలాంటి పరిస్థితి మరో తెలుగు దిగ్గజ కంపెనీకి రాకుండా చూసుకోవాల్సి ఉంది.