పవన్ కల్యాణ్, ప్రధాని మోదీ భేటీపై వైసీపీ సెటైర్లు వేస్తోంది. ఏపీలో జనసేనకు, బీజేపీకి ఓట్లు, సీట్లు లేవని ఆ పార్టీలు కలిస్తే ఎంత.. కలవకపోతే ఎంత అని.. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆ రెండు పార్టీలను అవమానించేలా మాట్లాడారు. బీజేపీ రోడ్ మ్యాప్‌లోకి టీడీపీని ఎలా తీసుకెళ్లాలని పవన్ భావిస్తున్నారని మంత్రి అమర్నాథ్ విమర్శించారు. టీడీపీ, బీజేపీని కలిపేందుకు జనసేన ప్రయత్నిస్తున్నారని ఆయన చెబుతున్నారు. మోదీ – పవన్ భేటీకి అంత ప్రాధాన్యత లేదని మరో మంత్రి బొత్స స్పందించారు. తాము స్పందించాల్సిన అవసరం లేదన్నారు.
ప్రధాని మోదీ పర్యటనలో ఏపీ విభజన హామీలు నెరవేరుతాయని భావిస్తున్నామని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. బీజేపీ-జనసేన మధ్య పొత్తు ఉందని, పొత్తు ఉన్న పార్టీ నాయకులు కలవడంలో ప్రాధాన్యత ఏముందన్నారు. ప్రధానితో పవన్ భేటీకి ఏ మాత్రం ప్రాధాన్యత లేదన్నారు. కేంద్రం ఏమిచ్చింది, పాచిపోయిన లడ్డు అన్న పవన్ కల్యాణ్ మాటలు జనం మర్చిపోలేదని కన్నబాబు అన్నారు. మూడేళ్లలో ఎన్నో సందర్భాల్లో సీఎం జగన్ ప్రధాని మోదీని నేరుగా కలిశారని కవర్ చేసుకున్నారు.
కారణం ఏదైనా పవన్ కల్యాణ్.. ఏదైనా ఓ అడుగు ముందుకేస్తున్నారంటే.. వైసీపీ నేతలు ముందుకు వచ్చి దారుణమైన కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. అదీ చివరికి ప్రధాని మోదీతో పవన్ భేటీ అవుతూంటే అలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఎలాంటి అధికారిక హోదాలో లేరు. రాజకీయ పరమైన సమావేశం నిర్వహిస్తున్నారు. జగన్ సీఎంగాఉండి.. అధికార హోదాలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధానితో ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ పవన్ ను మాత్రం విమర్శిస్తున్నారు.