ప్రధాని మోదీ బహిరంగసభ రాజకీయాలకు అతీతం అని వైసీపీ నేతలు ప్రకటించి.. కోట్ల కొద్దీ ప్రజాధనం వెచ్చించి ఆర్భాటంగా ఏర్పాట్లు చేయడమే కాదు.. చివరికి సొంత క్యాడర్‌కు ఖర్చు పెట్టి.. జన సమీకరణ చేస్తున్నారు. ఇంతా చేసి చివరికి వారికి అవమానమే మిగలబోతోంది. వేదికపై వైసీపీ నేతలెవరికీ చోటు దక్కడం లేదు. అందరూ బీజేపీ నేతలే ఉండనున్నారు. ప్రధాని సభ కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్, సీఎం, స్థానిక లోక్‌సభ ఎంపీకి వేదికపై అవకాశం కల్పిస్తారు. ఆ ప్రకారం జగన్‌తో పాటు స్థానిక ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూడా వేదికపై ఉంటారు.
మొత్తంగా సభా వేదికపై తొమ్మిది మంది ఉంటారు. వారిలో ప్రధాని మోదీ , సీఎం , గవర్నర్, స్థానిక ఎంపీ కాకుండా మరో ఐదుగురికి చోటు దక్కింది. ఈ ఐదుగురు బీజేపీ నేతలే. ఒక్క వైసీపీ నేతకూ చాన్స్ దక్కలేదు. నెల్లూరు బీజేపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, ఎంపీ జీవీల్ నరసింహారావు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణువ్, ఎంపీ సీఎం రమేష్, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌కు అవకాశం లభించింది. వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గరుండి సభా నిర్వహణ చూసుకున్నారు. అయినప్పటికీ ఆయనకు వేదికపై చోటు లభించలేదు. యూపీ ఎంపీగా రికార్డుల్లో ఉన్న జీవీఎల్‌కు వేదికపై చోటు దక్కింది.
జీవీఎల్ నరసింహారావు ఇటీవలి కాలంలో విశాఖలో ఎక్కువగా కనిపిస్తున్నారు., వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. మోదీ బహిరంగసభను బీజేపీ కన్నా వైఎస్ఆర్సీపీనే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పెద్ద ఎత్తున జన సమీకరణకు సన్నాహాలు చేసుకుంది. అయితే చివరికి అది బీజేపీ సభగా మారిపోయింది. వేదికపై జగన్ మాట్లాడేది కూడా తక్కువే. వేదికపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నలభై నిమిషాలు ప్రసంగించనుండగా.. ముఖ్యమత్రి జగన్‌కు ఏడు నిమిషాలు కేటాయించారు. చూసి రెండు పేరాలు చదివేలోపు ఆ సమయం కాస్తా గడిచి పోతుంది.