ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ బీజేపీ నేతలతో గంటన్నర పాటు సమావేశం అయ్యారు. కోర్ కమిటీ భేటీలో .. ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యాలపైనే మాట్లాడినట్లుగా చెబుతున్నారు. వడ్డించిన విస్తరి జగన్ ముందుకు వస్తే కాళ్లతో నెట్టేసుకున్నాడని.. అయితే అవకాశాల్ని అందిపుచ్చుకోవడంలో బీజేపీ విఫలమయిందన్న అభిప్రాయాన్ని మోదీ వినిపించినట్లుగా తెలుస్తోంది. ఒకప్పుడు ఏపీలాంటి పరిస్థితే ఉండే రాష్ట్రాల్లో బీజేపీ బలపడితే.. ఏపీలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని నిష్టూరమాడారంటున్నారు.
అందుకే ఇప్పటికైనా జగన్‌పై చార్జ్ తీసుకోవాలని.. గ్రామ గ్రామాన జగన్ వైఫల్యాలు.. నిర్వాకాలపై చార్జ్ షీటు దాఖలు చేసి.. ప్రజల్లో చర్చ పెట్టాలని మోదీ ఆదేశించినట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి త్వరలో వారి కార్యాచరణ ఖారరయ్యే అవకాశం ఉంది. అయితే నాలుగైదు నెలల కిందట అమిత్ షా ఏపీ పర్యటనకు వచ్చినప్పుడే వైసీపీ సర్కార్‌పై పోరాడాలని ఆదేశించారు. ఆ ప్రకారం ఇటీవల నిరుద్యోగయాత్ర, ఐదారువేల కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు. కానీ ఏపీ బీజేపీని పట్టించుకున్న వారే లేరు.
ఏపీ బీజేపీ పోరాడుతున్నా.. అంతా లైట్ తీసుకోవడానికి కారణం… ఏపీలోని కొంత మంది నేతల తీరు మాత్రమే కాదు.. కేంద్రం కూడా ప్రధాన కారణమే. వైసీపీని మిత్రపక్షంగానే బీజేపీ ఢిల్లీలో ట్రీట్ చేస్తోంది. లేకపోతే ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో వ్యవహరిస్తున్న విధానం.. ఏపీలో వ్యవహరిస్తున్న విధానంలో ఎందుకంత తేడా ఉంటుంది ? రాజ్యాంగవిరుద్దమైన బిల్లులను ఇక్కడ గవర్నర్ ఆమోదిస్తారు.. కానీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం ప్రభుత్వాలపై విరుచుకుపడుతూంటారు. ఇదొక్కటే కాదు.. అప్పులు ఇవ్వడం దగ్గర్నుంచి వైసీపీ నేతల కేసులకు సాయపడటం వలకూ చాలా అంశాల్లో ప్రజల్లో వేరే అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే వైసీపీపై బీజేపీ పోరాటం అంటే ఎవరూ నమ్మడం లేదు.
ముందుగా ..వైసీపీని కేంద్ర బీజేపీనే శత్రువుగా ప్రకటించాలి. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే..అప్పుడు రాష్ట్ర నేతలు.. ఏదో విధంగా అందుకుంటారు. లేకపోతే.. ఏపీ బీజేపీ ఏం చేసినా.. నాటకమనే జనం అనుకుంటారు.