ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించాల్సింది ప్రతిపక్షాలే కాదు మీడియా కూడా. కానీ తెలుగు మీడియా మోడీని ప్రశ్నించడం కాదు కదా.. భజన చేయడానికి పోటీ పడుతోంది. మోదీ రోడ్ షోలో జనం లేరు. కాలేజీ విద్యార్థుల్ని సమీకరించారు. కొంత మంది బీజేపీ నేతలు డబ్బులిచ్చి కొన్ని కాలనీల నుంచి మహిళలను తీసుకొచ్చారు. వారితోనే రోడ్ షో మమ అనిపించారు. మోదీ స్థాయి కాబట్టి.. అక్కడక్కడ పూలు చల్లే ఏర్పాట్లు..ఇతర హంగామా ప్లాన్ చేశారు, మొత్తంగా చూస్తే ఏపీలో బీజేపీ స్థాయి కన్నా ఎక్కువే చేశారని అనుకోవచ్చు. కానీ పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టారన్నట్లుగా మీడియాలు రిపోర్ట్ చేశాయి.
ఇలా చేసిన మీడియా సంస్థలు.. ఏపీ ప్రయోజనాల కోసం ఒక్క మాట కానీ.. ఒక్క ఆర్టికల్ కానీ రాయడం లేదు. ఎవరైనా సీఎం.. ఓ జిల్లాకు వెళ్తూంటే.. ఆ జిల్లా మొత్తానికి తెలిసేలా.. సమస్యల్ని గుర్తు చేయడం.. గతంలో ఇచ్చిన హామీలను మరోసారి తెరపైకి తేవడం… ప్రజల ఇబ్బందులను హైలెట్ చేయడం .. వంటివి మీడియా చేస్తూంటాయి. అది సహజం. అయితే దేశానికి ప్రధాని .. ఓ రాష్ట్రానికి వస్తూంటే ఆ రాష్ట్ర సమస్యలను ప్రధానికి తెలిసేలా చేయడానికి కూడా ఇలాంటివి రాస్తారు. కానీ తెలుగు మీడియా అలాంటిదేమీ చే్యలేదు సరి కదా.. ఆయనకు బాకా ఊదడానికి ప్రయత్నిస్తోంది.
ప్రజాస్వామ్యంలో మీడియా ఫోర్త్ ఎస్టేట్. పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం రాజీపడిపోతాయేమో కానీ మీడియా ఏ విషయంలోనూ రాజీ పడకూడదు . కానీ భయపడుతోంది. మోదీని విమర్శించాలంటే భయపడుతోంది.. ప్రశ్నించాలంటే కంగారు పడుతోంది. ఎందుకైనా మంచిదని పొగుడుతోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితి చాలా రోజుల కిందటే వచ్చింది.. ఇప్పుడు ఇంకా పెరుగుతోంది.