విశాఖలో మోదీ పర్యటన ముగిసింది. ఆయన నలభై నిమిషాల పాటు సభలో ప్రసంగించారు. ఈ సభకు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకుని వైసీపీ జాలను తరలించింది. ఇంద హడావుడి చేసిన ఈ సభలో ప్రధాని మోదీ ఏం చెప్పారు ? ఆయన ప్రసంగం మొత్తం విన్న తర్వాత ఏపీకి ఫలానా ప్రాజెక్ట్ ఇస్తున్నామని చెప్పలేదు.. విభజన హామీల గురించి చెప్పలేదు.. చివరికి సీఎం జగన్ .. సార్ మీరు సానుకూలంగా స్పందించాలంటూ చేసిన విజ్ఞప్తుల్లో ఒక్క దానినీ ప్రస్తావించలేదు. కానీ నలభై నిమిషాల్లో అత్యధిక సమయం.. విశాఖను.. తర్వాత ఏపీ ప్రజల్ని.. పొగడటానికి మాత్రం సమయం కేటాయించారు. తర్వాత తమను.. తమ పార్టీ నేతల్ని అభినందించడానికి వెచ్చించారు.
భారత దేశంలో విశాఖ ప్రత్యేకమైన నగరమన్నారు. వ్యాపారం కేంద్రంగా కొనసాగుతోందన్నారు. ఏపీ ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటడానికి కేవలం వారి తెలివితేటలు, టెక్నాలజీ మాత్రమే కారణం కాదని, వారి స్నేహ శీలత, మంచితనం కూడా ఓ కారణం అని పొగిడారు. ఇలాంటి పొగడ్తల తర్వాత శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుల గురించి చెప్పారు. వాటి వల్ల ఏపీకి చాలా మేలు జరుగుతుందన్నారు.
అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి.. పథకాల గురించి వివరించారు. అంతరిక్షం నుంచి సముద్ర గర్భం వరకు ప్రతి రంగంలోనూ మనం ప్రగతి సాధిస్తున్నామని చెప్పారు. అన్నదాతలకు ప్రతి ఏడాది మూడు విడతలుగా రూ.6 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ఓ వైపు తాము చేసిన అభివృద్ధి కారణంగా మరోవైపు పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. పేద ప్రజల కోసం సైతం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారికి అండగా నిలుస్తుందన్నారు.
విశాఖ విషయంలో తమ పార్టీ నేతల కృషిని కూడా గుర్తు చేసుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హరిబాబులకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. వాళ్లు ఎప్పుడు కలిసినా ఏపీ ప్రజల సంక్షేమం, డెవలప్మెంట్ గురించి చర్చించేవాళ్లమని చెప్పారు. మౌలిక వసతుల కల్పనలో తమ విజన్ ఏంటన్నది, నేడు ప్రారంభించిన ప్రాజెక్టులు తెలియజేస్తాయన్నారు ప్రధాని మోదీ.