రేవంత్ రెడ్డి తెలంగాణలో పాదయాత్రకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు . డిసెంబర్ 9 నుంచి ఆయన పాదయాత్ర ఉంటుంది. దీనికి సంబందించి సైలెంట్‌గా హైకమాండ్ వద్ద తనకు కావాల్సిన అన్ని రకాల అనుమతులు తెచ్చుకున్నారు. అడ్డుకునేందుకు ఇంత కాలం ప్రయత్నించిన సీనియర్లు.. చేజేతులా.. తమ విశ్వసనీయతను హైకమాండ్ వద్ద పోగొట్టుకున్నారు. దీంతో ఇప్పుడు రేవంత్‌కే కలసి వచ్చింది.
తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు మంచి స్పందన వచ్చింది. పాదయాత్రతో పాటు మునుగోడు ఉపఎన్నికలనూ ఒంటి చేత్తో రేవంత్ రెడ్డి సమన్వయం చేశారు. రేవంత్ పనితీరు రాహుల్ గాంధీకి బాగా నచ్చింది. అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడానికి తాను కూడా పాదయాత్ర చేయాలనుకుంటున్నానని చెప్పడంతో రాహుల్ అంగీకరించారు. ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు కానీ.. కాంగ్రెస్ పార్టీలోని రేవంత్ వర్గీయులు ఇప్పటికే పాదయాత్ర ఏర్పాట్లు, రూట్ మ్యాప్ వంటి అంశాలపై కసరత్తు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణలో ఎన్నికలకు ఇంకా ఖచ్చితంగా ఏడాది మాత్రమే సమయం ఉంది. ఆరు నెలల్లో తెలంగాణ మొత్తం పాదయాత్ర పూర్తి చేసి ఆ తర్వాత .. ఎన్నికల సన్నాహాలను ముందుండి చేయాలని రేవంత్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను కూడా పాదయాత్ర చేస్తానని గతంలో పోటీ వచ్చారు. ఇప్పుడు ఆయన పార్టీలో ఉన్నారో లేరో తెలియని పరిస్థితి ఏర్పడింది. అంతే కాదు ఆయన పై పార్టీ హైకమాండ్ కూడా నమ్మకం కోల్పోయింది. దీంతో రేవంత్‌కు లైన్ క్లియర్ అయినట్లంది.