ప్రధాని మోదీ ఒకే రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా స్పష్టంగా ప్రసంగాల్లో తేడా కనిపించింది. ఏపీలో చాలా సాదాసీదాగా ప్రసంగించారు. వైసీపీ ప్రస్తావన కానీ .. జగన్ పాలన తీరు కానీ ఆయన దృష్టికి వెళ్లలేదు. మాట్లాడలేదు. కానీ తెలంగాణలో మాత్రం అటు పార్టీ కార్యకర్తల సమావేశంతో పాటు.. అధికారిక కార్యక్రమంలోనూ రాజకీయ వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్‌ను టార్గెట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉంటారు. అవినీతి పాలన అంటారు. ఏపీని భ్రష్టు పట్టించారని మూడు రాజధానుల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపిస్తూ ఉంటారు. కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనలో మాత్రం అలాంటి విమర్శలేమీ వినిపించలేదు. తెలంగాణ వెళ్లిన వెంటనే మోదీ మాట మారిపోయింది. పూర్తి స్థాయిలో టీఆర్ఎస్‌ను టార్గెట్ చేశారు. తెలంగాణ ప్రజలు ఇక్కడి అవినీతి, కుటుంబ పాలనపై పోరాడుతున్నారని ప్రకటించారు. అవినీతి, కుటుంబ పాలన వల్ల జరుగుతున్న నష్టాన్ని బీజేపీ భర్తీ చేస్తుందన్నారు. బీజేపీ నేతల పోరాటంతో మోదీ మాటలు సింక్ అయ్యాయి.
మోదీ పర్యటన ఎఫెక్ట్ ఏపీ బీజేపీపైనే ఎక్కువ పడే అవకాశం కనిపిస్తోంది. వారు ఇక ఏ పోరాటం చేసినా ప్రయోజనం ఉండే అవకాశం లేదు. ఎందుకంటే మోదీనే ఏపీకి వచ్చి ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు. తెలంగాణలో బీజేపీ ప్రధాన పోటీదారుగా ఎదిగింది. ఏపీలో లేదు.అందుకే మోదీ.. ఏపీలో మద్దతుగా ఉంటున్న వైఎస్ఆర్‌సీపీ విషయంలో సాఫ్ట్‌గా ఉండి.. ప్రత్యర్థిగా మారిన టీఆర్ఎస్ విషయంలో కఠినంగా మాట్లాడారని అంటున్నారు. అదే సమయంలో.. ఏపీలో రాజకీయ సభ పెట్టలేదని కవరింగ్ చేసుకుంటున్నారు. ఎవరు పెట్టవద్దన్నారు.. రోడ్ షో బదులు చిన్న సభ పెట్టుకుంటే సరిపోయేదిగా? ఇవన్నీ వైసీపీ ని విమర్శించకుండా తప్పించుకోవడానికి సాకులు.
మొత్తంగా అవినీతి పాలన విషయంలో మోదీది అందరిపై ఒకే అభిప్రాయం లేదని.. తనకు వ్యతిరేకులైన వారిపై మాత్రమే అవినీతి ముద్ర ఉంటుందని ఆయన మరోసారి నిరూపించినట్లయింది.