కాంగ్రెస్ సీనియర్ నేత టి.సుబ్బరామిరెడ్డి ఆయన కుుటంబసభ్యులు బ్యాంకుల వద్ద వేల కోట్లు అప్పు తీసుకుని వ్యక్తిగత సెక్యూరిటీ ఇచ్చి మరీ అప్పులను ఎగ్గొట్టారు. దీంతో బ్యాంకులు వారిని దివాలా తీసినట్లుగా ప్రకటించి.. వారి ఆస్తులను వేలం వేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఎన్సీఎల్టీలో పిటిషన్లు దాఖలు చేశాయి. టి.సుబ్బరామిరెడ్డితో పాటు ఆయన భార్య.. కుమారులు, ఇతర సన్నిహితులపై ఈ పిటిషన్లను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దాఖలు చేసింది.
సుబ్బరామిరెడ్డి కుటుంబానికి చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్ వివిధ బ్యాంకుల నుంచి రూ. ఆరు వేల కోట్ల రుణాలను తీసుకుంది.కానీ చెల్లించడం మానేసింది. ఈ రుణాలకు.. టి.సుబ్బరామిరెడ్డి తో పాటు ఆయన కుటుంబసభ్యులు వ్యక్తిగత హామీదారులుగా ఉన్నారు. ఒక్క బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రనే కాకుండా ఇతర బ్యాంకులు కూడా పిటిషన్లు దాఖలు చేశాయి. గాయత్రి ప్రాజెక్ట్స్కు పనులు చేసి కూడా బిల్లులు ఇవ్వడం లేదని మరికొన్నిఇతర కంపెనీలూ ఫిర్యాదు చేశాయి.
గాయత్రి ప్రాజెక్ట్స్ ఒకప్పుడు దేశంలోని అగ్రశ్రేణి నిర్మాణ సంస్థల్లో ఒకటి. మౌలిక సదుపాయాల రంగంలో మంచి అనుభవం ఉన్న కంపెనీ. కానీ ఇటీవలి కాలంలో ఆ కంపెనీ పూర్తిగా వెనుకబడింది. కార్యకలాపాలు తగ్గిపోయాయి. చివరికి ఎంతో ఆర్భాటంగా పుట్టిన రోజు వేడుకలు.. ఇతర పార్టీలు చేసుకునే సుబ్బరామిరెడ్డి ఇటీవలి కాలంలో బయట కనిపించడం తగ్గిపోయింది. దీనంతటికి కారణం ఆర్థిక ఇబ్బందులేనని చెబుతున్నారు. గతంలో సుబ్బరామిరెడ్డి ఏ కార్యక్రమం చేపట్టిన.. సినీ పరిశ్రమ అంతా తరలి వచ్చేది. ఇప్పుడు మాత్రం ఏ కార్యక్రమమూ చేపట్టడం లేదు.