మంత్రి రోజా పరిస్థితి నగరి నియోజకవర్గంలో రోజు రోజుకు దిగజారిపోతోంది. ఆమె నోరు.. వ్యవహారం ఏ మాత్రం పొసిగే విధంగా లేకపోవడంతో.. నగరి నియోజకవర్గంలో క్యాడర్ అంతా దూరమయ్యారు. వైసీపీ అని పట్టుకుని ఉన్న వారిని కూడా ఆమె దూరం చేసుకుంటున్నారు. ప్రతీ వారం ఏదో వివాదం చోటుచేసుకుంటూనే ఉంది. జగన్ కేబినెట్ లో మంత్రులు ఎప్పుడూ తాడేపల్లిలో కనిపించరు. సొంత నియోజకవర్గాల్లోనే ఉంటారు. ఎప్పుడైనా ప్రెస్‌మీట్ పెట్టమంటేనే.. తాడేపల్లికి వస్తారు. అధికారిక సమీక్షలు ఎప్పుడూ చేయరు. విడదల రజనీ లాంటి అతి కొద్ది మందికి మాత్రమే ఆ చాన్స్ ఉంటుంది.
రోజాకు కూడా సొంతంగా సమీక్షలు పెట్టే చాన్స్ లేదు. పెట్టమని ముఖ్య సలహాదారు నుంచి ఆదేశాలు వస్తే సరి లేకపోతే..లేదు. అయితే రోజా నియోజకవర్గంలో కూడా ఉండటం లేదు. పర్యటనలు ఎక్కువగా చేస్తున్నారు. నగరికి వచ్చినప్పుడు మాత్రం.. మంత్రి హోదాను అడ్డం పెట్టుకుని.. ఏదో ఓ వివాదాస్పదమైన పని చేస్తున్నారు. తాజాగా పార్టీ క్యాడర్ కాంట్రాక్ట్‌కు తీసుకుని నిర్మించిన ఆర్బీకే బిల్లులు పెండింగ్‌లో ఉండగానే బలవంతంగా ప్రారంభించేశారు. బిల్లులు రావాలని.. ప్రారంభించేస్తే రావాలని ఇతర నేతలు అడ్డుకున్నా ఆగలేదు.
నగరి నియోజకవర్గంలో మొత్తం ఐదు మండలాలు ఉన్నాయి. ఒక్క మండలంలోని క్యాడర్‌తో ఆమెకు సన్నిహిత సంబంధాలు లేవు. నగరి మున్సిప్ల చైర్మన్‌తోనూ గొడవలే. జడ్పీటీసీలు లాంటి కీలక పదవుల్లో ఉన్న వారితోనూ ఇబ్బందులే. తను పట్టుబట్టి పదవులు ఇప్పించుకున్న కొంత మందితోనే ఆమె రాజకీయం చేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో రోజాకు టిక్కెట్ ఇస్తే పని చేసే ప్రశ్నే లేదని మెజార్టీ క్యాడర్ స్పష్టం చేస్తున్నారు. అయితే రోజా టంగ్ పవర్‌కు వైసీపీ హైకమాండ్ కూడా భయపడుతోంది. అందుకే.. ఏం చేయాలా అని మథనపడుతున్నట్లుగా చెబుతున్నారు.