టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మునుగోడు ఉపఎన్నికల్లో వచ్చిన విజయంతో దూకుడు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ .. వచ్చే నెలలో బీఆర్ఎస్గా మారనుంది. ఆ తర్వాత నుంచి ఆయన కార్యక్షేత్రం ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. ఢిల్లీలో బహిరంగసభ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వచ్చే నెల ఏడో తేదీ లోపున బీఆర్ఎస్ లాంఛనం పూర్తవుతుంది. ఆ తర్వాత ఒకటి రెండు రోజులకే బహిరంగసభ పెట్టి జెండా.. అజెండాను ప్రకటించనున్నారు. దీనికి సంబంధించి పార్టీ కార్యవర్గంతో కేసీఆర్ చర్చించాలని నిర్ణయించారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలంటే.. ముందు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కావాలి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. ఈ సారి కూడా మరో ఆరు నెలల ముందు ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందన్న చర్చ కొంత కాలంగా టీఆర్ఎస్లో ఉంది. కానీ కేసీఆర్ మాత్రం ఇలాంటి ఊహాగానాల్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. మరో వైపు సీఎం బాధ్యతలు కేటీఆర్‌కు ఇస్తారన్న ప్రచారం కూడా కొంత కాలంగా జరుగుతోంది. పార్టీ నేతలు కూడా కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం అని బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. అయినా వారిని ఎవరూ వారించలేదు.
మొత్తంగా కేసీఆర్ వచ్చే ఆరు నెలలు తెలంగాణలోనే తీరిక లేని రాజకీయ కార్యక్రమాలు చేపట్టనున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత జాతీయ రాజకీయాలపై దృష్టి పెడతారని అంటున్నారు. ఇప్పటికైతే ముందస్తు ఎన్నికల ఆలోచన లేదని.. బీజేపీ కూడా ముందుకు రాకపోవచ్చని అంటున్నారు. మంగళవారం కేసీఆర్ నిర్వహించనున్న విస్తృత కార్యవర్గ సమావేశంలో టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అందులోనే… ముందస్తుకు వెళ్తారా లేదా కేటీఆర్‌ను సీఎంను చేస్తారా అన్న విషయాలపై చూచాయగా అయినా కేసీఆర్ క్లారిటీ ఇచ్చే చాన్స్ ఉంది.