ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సలహాదారులకు కొదవలేదు. వారానికొకరిని నియమిస్తూనే వెళ్తున్నారు. తాజాగా… సలహాదారులకు సలహాదారుల నియామకం ప్రారంభమయింది. ముఖ్యమంత్రి స్పీచ్‌లు రాసే జీవీడీ కృష్ణమోహన్ అనే సాక్షి మాజీ జర్నలిస్టుకు ఇప్పటికే సలహాదారు పదవి ఉంది. ఈ పదవితో ఆయనకు నెలకు నాలుగైదు లక్షల వరకూ చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఆయనకు మరో ఐదుగుర్ని సలహాదారులుగా నియమించారు. వారందరికి కలిపి నెలకు ఐదు లక్షల వరకూ .. జీత భత్యాలు చెల్లించనున్నారు. ఈ ఐదుగురుకి సలహాదారులకు సలహాదారులని కాకుండా జీవీడీకి సహాయకారులగా చెబుతున్నారు. ఏదైనా.. చేసే పని మాత్రం సలహాదారుకు సలహాలివ్వడమే.
ఈ ఐదుగురు ఎవరో కాదు.. సాక్షి ఉద్యోగులే. నిన్నటి వరకూ సాక్షి పే రోల్స్‌లో జీతం వచ్చేది. ఇప్పుడు ప్రజాధనాన్ని జీతం రూపంలో తీసుకుంటారు. వీరిలో సాక్షి టీవీ ఏపీ బ్యూరో చీఫ్ వెన్ను శ్రీనివాసరావు కూడా ఉన్నారు. నిజానికి ఆయన ఆ స్థానంలో ఉండటమే చాలా మందికి ఆశ్చర్యం . ఎందుకంటే.. వ్యతిరేకించే వర్గానికి చెందిన ఆయన ఆ స్థానంలో ఉండటం ఏమిటని చాలా కాలంగా సాక్షిలోనే ఆయనపై ఫిర్యాదులు వెళ్తూనే ఉన్నాయి. కానీ వెన్ను శ్రీనివాస్ .. తను జగన్ హార్డ్ కోర్ ఫ్యాన్‌నని సోషల్ మీడియాలో ఇతరులతో వాదనలు పెట్టుకుని నిరూపించకుంటూ ఉంటారు. వివేకా హత్య సమయంలో కడపలోనే స్టాఫర్‌గా ఉన్న ఆయన వివేకాది హత్య కాదు గుండెపోటుగా నమ్మించడానికి శతవిధాలా ప్రయత్నం చేసి … జగన్ మెప్పు పొందారు. అందుకే ఏపీ బ్యూరో చీఫ్ అయ్యారు. కానీ ఇప్పుడు సాక్షి నుంచి ప్రభుత్వ రోల్స్‌లోకి తెచ్చారు.
ఇప్పుడు సాక్షి ఏపీ బ్యూరో చీఫ్‌గా .. ఓ రెడ్డిని నియమించే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నందున ప్రభుత్వంతో పాటు సాక్షిని కూడా.. ఓ వర్గంతోనే నింపి.. ప్రక్షాళన చేసుకునే ప్రక్రియలోనే తాజా నియామకాలు జరిగాయని అంటున్నారు. కారణం ఏదైనా… ఏం జరిగినా… ప్రజాధనానికే .. రెక్కలు వస్తూండటం.. సాక్షి నిర్వహణ కూడా ప్రజాధనంతోనే చేస్తూండటం .. ఏపీ ప్రజల దురదృష్టమే.