ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాలు తగ్గాయట. ఈ విషయం ఎవరో చెబితే ఫేక్ న్యూస్ అని తీసిపడేస్తాం. కానీ చెప్పింది స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి. అందుకే ఫేక్ అయినా నమ్మాల్సిందే. ఆదాయార్జన శాఖలపై సమీక్ష జరిపినప్పుడు సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. భారీగా రేట్లు పెంచడం వల్ల అమ్మకాలు తగ్గాయని ఆయన చెబుతున్నారు. నిజానికి అమ్మకాలు పెరిగాయా.. తగ్గాయా.. అంటే.. ప్రజల కళ్ల ముందే అసలు వాస్తవం కనిపిస్తూనే ఉంది.
ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాలు అనేది ఓ పెద్ద రాజకీయ అంశం. మద్యాన్ని స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేసి ఎన్నికలకు వెళ్తామని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఎన్నికల మేనిఫెస్టోలోనూ.. సభల్లోనూ ప్రకటించారు. ఆ ప్రకారం తాము మద్యాన్ని నియంత్రిస్తున్నామని సీఎం చెబుతున్నారు. నిజానికి మద్యంపై ఆదాయం మాత్రం ఊహించనంతగా పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. ఆరు వేల కోట్ల వరకూ ఉండే ఆదాయం.. 2021 – 22లో ఆదాయం రూ.25 వేల కోట్లకు చేరింది. బాటిళ్లు, కేసుల వారీగా తగ్గాయని జగన్ అంటున్నారు..కానీ ఇటీవల పెరుగుతున్నాయి. దీనికి తోడు అక్రమ మద్యం, సారా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఆర్నెల్లలో అక్రమ మద్యం తయారీ, రవాణా, గంజాయిలకు సంబంధించి మొత్తం 20,127 కేసులు నమోదు చేశారు. ఆరు నెలల్లోనే ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయంటే.. పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మద్యం ఏపీలోకి వస్తున్నట్లేనన్న మరి. స్మగ్లింగ్ మద్యం నాటు సారాకు జనం అలవాటు పడుతున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లుగా .. మద్యం అమ్మకాలు బాటిళ్ల వారీగా తగ్గాయ కానీ తాగే మనుషులు తగ్గలేదని వారు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారని అంటున్నారు.
గతంలో తక్కువకు వస్తుందని శానిటైజర్లు తాగి కొంత మంది చనిపోయారు కూడా. అలాగే ఏపీలో అమ్ముతున్న లిక్కర్ పైనా చాలా ఆరోపణలు ఉన్నాయి. వాటిలో విషపదార్థాలు ఉన్నాయని కొన్ని ల్యాబ్ల రిపోర్టులు వెలుగులోకి వచ్చాయి. కళ్ల ముందు ఇంత కనిపిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం.. లిక్కర్ నుంచి ప్రజలను విముక్తి చేస్తున్నామని చెబుతున్నారు. వాస్తవానికి గ్రామాల్లో నాటుసారా విప్లవం ఉందన్న వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ ప్రజల కళ్లకు మాత్రం గంతలు కడుతున్నారు. మద్యం అమ్మకాలు తగ్గాయంటున్నారు.