తేజ… చిత్రసీమలో తనదో బ్రాండ్. కొత్తవాళ్లతో ప్రయోగాలు చేసి, సూపర్ హిట్లు కొట్టిన ఘనత తేజ సొంతం. ఇప్పటి వరకూ దాదాపుగా 1000మంది నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని చిత్రసీమకు అందించాడు. తేజ సినిమా తీస్తున్నాడంటే కచ్చితంగా కొత్త వాళ్ల ప్రతిభ వెలుగులోకి వస్తుందని అంతా నమ్ముతుంటారు. అయితే.. తేజ దగ్గర ఓ బ్యాడ్ హ్యాబిట్ కూడా ఉంది. సెట్లో… నటీనటులపై చేయి చేసుకోవడం. సీన్ తను అనుకొన్నది అనుకొన్నట్టు రాకపోతే… దండోపాయం ప్రయోగిస్తారు. ఈ విషయం ఆయన చాలాసార్లు ఒప్పుకొన్నాడు కూడా. ”సెట్లో ప్రతీ నిమిషం చాలా ముఖ్యం. ఒకరి వల్ల షూటింగ్ ఆలస్యమైతే నిర్మాత చాలా నష్టపోతుంటాడు. ఆ వృథాని నేను అస్సలు సహించను. అందుకే చేయి చేసుకోవడం తప్పడం లేదు. సెట్లో ఉన్నవాళ్లంతా నా శిష్యులే. కాబట్టి.. దాన్ని తప్పుగా కూడా అనుకోను” అని తనని తాను వెనకేసుకొస్తారాయన. ఉదయ్ కిరణ్, కాజల్, నవదీప్… వీళ్లంతా అలా తేజ తో దెబ్బలు తిన్నవారే. ప్రతీ సినిమాలోనూ ఒకరిద్దరికి తేజ చేతిలో దెబ్బలు తప్పవు. ఇప్పుడాయన సురేష్ బాబు తనయుడు అభిరామ్ హీరోగా ‘అహింస’ సినిమాని రూపొందించారు. ఈ సినిమాలో.. అభిరామ్ కీ… ఆ రుచి చూపించార్ట తేజ.
‘అహింస’లో ఓ లెంగ్తీ సీన్ ఉంది. అందులో నటించడానికి అభిరామ్ చాలా ఇబ్బంది పడ్డాడట. ఎన్నిసార్లు రీ షూట్ చేసినా ఆ సీన్ పూర్తవ్వకపోయేసరికి తేజ చేయి చేసుకొన్నాడట. ఆ తరవాత.. ఆ సీన్ బాగా పండిందనుకోండి. అది వేరే విషయం. అయితే.. ఈ సినిమాకి నిర్మాత స్వయగా సురేష్ బాబు. తండ్రి బ్యానర్లో కొడుకు నటిస్తున్నాడు. ఆ సెట్లో కొడుకుపై దర్శకుడు చేయి చేసుకొన్నాడు. ఇదే విషయమై… కొన్ని రోజుల పాటు అభిరామ్ అలకబూనాడని, దాంతో షూటింగ్ కి కూడా డుమ్మా కొట్టాడని అభిరామ్ కి సర్ది చెప్పి మళ్లీ సెట్ కి పంపించేసరికి సురేష్ బాబుకి తల ప్రాణం తోకలోకి వచ్చిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే కదా.. హీరోలు తేజతో సినిమా అంటే భయపడేది.