నీకేనా పోలీస్.. నాకు లేరా ? అన్నట్లుగా టీఆర్ఎస్ , బీజేపీ పోటీ పడి దర్యాప్తు సంస్థలను పావుగా వాడుకుని రాజకీయాలు చేస్తున్నాయి. ఓ వైపు సీబీఐ, ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచి తెలంగాణ నేతల్ని టార్గెట్ చేస్తూండగా.. ఎమ్మెల్యేల కేసులో.. టీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ కూడా.. అదే స్థాయిలో బీజేపీ నేతల్ని టార్గెట్ చేస్తోంది. మరో వైపు ఐటీ దాడులకూ టీఆర్ఎస్ సర్కార్.. స్టేట్ జీఎస్టీ అధికారులతో సమాధానం ఇస్తోందన్న అభిప్రాయం కలిగేలా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారం ఢిల్లీ వ్యవహారాల కన్నా.. తెలంగాణ రాజకీయాల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. లిక్కర్ స్కాం బయటపడినప్పుడు బీజేపీ నేతలు పూర్తిగా కల్వకుంట్ల కవితను టార్గెట్ చేశారు. ఆమెపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆ కేసులో .. సీబీఐ, ఈడీ దూకుడుగా పని చేస్తున్నాయి.బీజేపీ వైపు నుంచి ఈ మైండ్ గేమ్ ఇలా సాగుతూండగా.. తెలంగాణ వైపు నుంచి బీజేపీ పెద్దల్ని బుక్ చేసేలా.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ సాగుతోందన్న సంకేతాలను టీఆర్ఎస్ నేతలు ఇస్తున్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని తెలంగాణ సర్కార్ చాలా తీవ్రంగా తీసుకుంది. ఇతర రాష్ట్రాల్లో కూల్చిన ప్రభుత్వాల లెక్క కూడా బయట పెట్టాలని అనుకుంటోంది. అక్కడి డీలింగ్స్.. నగదు లావాదేవీలు అన్నీ .. కొత్తగా ఏర్పాటు చేసిన సిట్ ద్వారా వెలుగులోకి తెచ్చి దేశవ్యాప్తంగా.. ఎమ్మెల్యేల కొనుగోళ్లు అంశాన్ని హైలెట్ చేయాలనుకుంటోంది. లిక్కర్ స్కాంలో కేంద్రం అరెస్టులకు సిద్ధపడితే.. ఇక్కడ సిట్ కూడా ఢిల్లీలో బీజేపీ కీలక నేతల సంగతి చూసుకుంటుందని టీఆర్ఎస్ నేతలు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీకేనా దర్యాప్తు సంస్థలు.. మాకు లేవా అన్నట్లుగా ఈ సవాళ్లు నడుస్తున్నాయి.
దర్యాప్తు సంస్థలు ఇలా రాజకీయాల కోసం పని చేస్తూండంతో.. రాజకీయ ఉద్రిక్తత ఏర్పడుతోంది. అధికార పార్టీల మధ్య పోరాటం ఎటు వైపు దారి తీస్తుందోనన్న ఆందోళన అందరిలోనూ కనిపిస్తోంది.