కృష్ణ తన ఇద్దరు కొడుకులు (రమేష్ బాబు, మహేష్ బాబు)లతో కలిసి నటించిన చిత్రం ‘ముగ్గురు కొడుకులు’. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా వెనుక ఓ చిన్న కథ ఉంది. ఈ సినిమా… కృష్ణ మాతృమూర్తి నాగరత్నమ్మ కోరిక మేరకు తీసిన సినిమా. ఆమెకు ముగ్గురు కొడుకులు. కృష్ణ, హనుమంతరావు, ఆది శేషగిరిరావు. అందుకే తన ముగ్గురు కొడుకులకు ప్రతీకగా ఆ టైటిల్ ఓ సినిమా చేయాలన్నది ఆమె కల. ఈ విషయం చాలా సార్లు కృష్ణకు చెప్పారు. అమ్మ కోసం రచయిత మహారథిని పిలిపించి… ‘ముగ్గురు కొడుకులు’ పేరుతో ఓ కథ తయారు చేయమన్నారు. కథ రెడీ కాకుండానే.. ‘ముగ్గురు కొడుకులు’ అనే టైటిల్ రిజిస్టర్ కూడా చేసేశారు. ఎంతకాలమైనా మహారథి స్క్రిప్టు రెడీ చేయకపోయే సరికి.. నాగరత్నమ్మకు కోపం వచ్చేసింది. ‘మహారథి ఒక్క ముక్క కూడా రాయలేదు. ఇలాగైతే సినిమా ఎప్పుడు తీస్తావ్’ అంటూ కృష్ణని కాస్త గట్టిగానే అడిగారు ఆమె. దాంతో.. పరుచూరి బ్రదర్స్‌ని పిలిపించారు.
పరుచూరి ఓ కథ రెడీ చేశారు కానీ.. అది నాగరత్నమ్మకు నచ్చలేదు. చివరికి.. పి.సి.రెడ్డి ఓ లైన్ చెప్పడంతో అది నచ్చి దాన్ని కథగా డవలెప్ చేశారు. ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ సంభాషణలు అందించారు. ఈసినిమాలోని ఓ చిన్న సన్నివేశంలో మహేష్ బాబు అల్లూరి సీతారామరాజు గెటప్‌లో కనిపించి, మురిపించాడు. ఈ సినిమా విడుదలై… సూపర్ హిట్ అయ్యింది. అయితే.. వంద రోజుల వేడుక జరక్కుముందే కృష్ణ మాతృమూర్తి కన్నుమూశారు. కాకపోతే…ఆమె కోరికని నెరవేర్చిన సంతృప్తి కృష్ణకు దక్కింది.