ఎమ్మెల్యేల కొనుగోలు కేసులను సీబీఐకి ఇవ్వాలంటూ బీజేపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తోసి పుచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం .. సిట్ ద్వారానే విచారణ కొనసాగించాలని ఆదేశించింది. సిట్‌కు నేతృత్వం వహిస్తున్న సీవీ ఆనంద్ పారదర్శకంగా దర్యాప్తు చేయాలని హైకోర్టు సూచించింది. ఈ నెల 29న దర్యాప్తు నివేదికను హైకోర్టుకు సమర్పించాలని ఆదేసశించింది.
ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయట పడిన వెంటనే.. తమకు తెలంగాణ ప్రభుత్వ పోలీసు వ్యవస్థపై నమ్మకం లేదని.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ నేతలు కోర్టులో పిటిషన్ వేశారు . సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. ఈ అంశంపై వాదనల తర్వాత హైకోర్టు రాష్ట్ర సిట్‌నే విచారణ కొనసాగించాలని ఆదేశించింది. ఈ కేసు పరిధి ఎక్కువ అని.. ఇతర రాష్ట్రాల్లోనూ దర్యాప్తు చేయాల్సి ఉన్నందున.. రాష్ట్ర దర్యాప్తు సంస్థ వల్ల కాదని.. సీబీఐ అయితే .. చేయగలుగుతుందని వాదించినా ప్రయోజనం లేకపోయింది.
సీబీఐకి ఇస్తే… అది కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉందని.. ఇప్పటి వరకూ రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐని ప్రయోగించారని.. వారికి ఇస్తే ఈ కేసును కూడా అలాగే వాడుకుంటారని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. సిట్ దర్యాప్తుపై ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మరో వైపు మూడు రోజుల కిందట చీఫ్ జస్టిస్‌ను కేసీఆర్ కలిశారు. ఈ అంశంపై ప్రజాశాంతిపార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ .. సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు.