ఇతర పార్టీల నుంచి వచ్చి బీజేపీలో చేరి ఉపఎన్నికలను ఎదుర్కొన్న ఇద్దరు నేతలను బీజేపీ హైకమాండ్ ఢిల్లీకి పిలిపించింది. ఇతర తెలంగాణ బీజేపీ ముఖ్య నేతల్ని ఆహ్వానించలేదు. కేవలం వారిద్దరిని మాత్రమే పిలిచారు. వారితో ఇతర ముఖ్య నేతలతో పాటు ..చివరిగా అమిత్ షా కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. తెలంగాణ బీజేపీలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరుతున్న వారు బలంగానే పోరాడుతున్నారు. కానీ వారు ఎక్కడ బలపడితే తమ స్థానాలకు ఎసరు వస్తుందోనని బీజేపీలో పాతుకుపోయిన కొంత మంది వారికి సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఈటల రాజేందర్ ఈ విషయంలో తీవ్ర అసంతృప్తికి గురైనట్లుగా గతంలో చాలా సార్లు ప్రచారం జరిగింది. అయినప్పటికీ వారు తమ అసంతృప్తిని హైకమాండ్‌కు తెలిసేలా చేస్తున్నారు కానీ ఆ ప్రభావం పార్టీపై పడకుండా జాగ్రత్త పడుతున్నారు. అదే సమయంలో చేరికల ఇంచార్జ్‌గా కూడా ఈటల ఉన్నారు. కానీ చేరికలు… సంప్రదింపులు అన్నీ ఈటలకు సంబంధం లేకుండానే సాగుతున్నాయి.
ఈ మొత్తం అంశాలపై హైకమాండ్ వీరి వద్ద నుంచి పూర్తిస్థాయి సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు కుదురుకోలేకపోతున్నారన్న ప్రచారంతో రాబోయే కాలంలో వచ్చి చేరే వారికి మరింత భరోసా ఇచ్చేందుకు ఈటల , కోమటిరెడ్డిలకు బీజేపీ హైకమాండ్ కొన్ని సూచనలు చేయడంతో పాటు కీలక బాధ్యత్లు అప్పగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీరిలో ఎవరికైనా కీలక పదవి లభిస్తే.. పార్టీలో చేరాలనుకునేవారు కూడా మరింత ఉత్సాహం చూపించే అవకాశం ఉందని భావిస్తున్నారు.