ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్ తాను చాలా సాక్ష్యాలు సేకరించానని.. వాటన్నింటినీ అన్ని రాష్ట్రాల చీఫ్ జస్టిస్‌లకు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా పంపానని ప్రకటించారు. ఇప్పుడా అంశం.. వివాదాస్పదమవుతోంది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జయ్ భుయాన్ ఈ అంశంపై హైకోర్టు విచారణలో ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి ఇవ్వాలంటూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణలో తెలంగాణ ప్రభుత్వం తరపున దుష్యంత దవే వాదనలు వినిపించారు. వాదనలు వినిపిస్తున్న సమయంలో చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్.. టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ నుంచి తనకు ఓ కవర్ వచ్చిందని… అందులో సీడీలు, పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయని.. వాటినేం చేయాలని ప్రశ్నించారు. అలా పంపడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
వెంటనే ప్రభుత్వం తరపున వాదిస్తున్న దుష్యంత్ దవే.. అలా జరిగి ఉండాల్సింది కాదన్నారు. అది మంచి పద్దతి కాదని.. అయితే దాని గురించి తనకు అవగాహన లేదన్నారు. అయితే ఇప్పుడేం చేయమంటారని చీఫ్ జస్టిస్ .. లాయర్ దవేను ప్రశ్నించారు. ఆయన బయటపడేయాలని సూచించారు. అయితే అవి ఇతరులకు దక్కితే ప్రమాదమన్నారు. వాటిని ధ్వంసం చేయడం మంచిదన్నారు. తనకు మరో హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఫోన్ చేశారని.. ఇలాంటి పార్శిల్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ నుంచి అందిందని చెప్పారనన్నారు. ఇలా జరగడం న్యాయవ్యవస్థకు ఆరోగ్యకరం కాదని.. దానికి తాను క్షమాపణలు చెబుతున్నానని దవే కోర్టుకు తెలిపారు.
రాజకీయాలను రాజకీయాలుగానే చేసుకోవాలని కోర్టులను .. న్యాయవ్యవస్థను లాగడం మంచిది కాదని ఉజ్జల్ భుయాన్ ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదికి స్పష్టం చేశారు. అదే సమయంలో దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్న సమయంలో సీక్రెట్ పత్రాలన్నీ మీడియాలో కనిపిస్తున్నాయని.. ఇది చాలా బ్యాడ్ ప్రాక్టీస్ అన్నారు. ఇలాంటివి జరగకుండా చూస్తామన్నారు. తన 44 ఏళ్ల న్యాయ సర్వీసులో ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. దీంతో ప్రభుత్వం తరపు న్యాయవాది భేషరతు క్షమాపణ చెప్పారు.