ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష విజయం సాధించింది. ఇతరుల్ని నామినేషన్లు వేయనివ్వలేదని.. విపక్షాలపై కేసులు పెట్టారని.. ఇలా రకరకాలుగా ఆరోపణలు వచ్చినా.. ప్రజాస్వామ్యంలో గెలుపు గెలుపే.. అధికారం వారి చేతిలోకి వచ్చేసింది. అయితే ఇంకా కాకినాడ, రాజమండ్రి కార్పొరేషన్ సహా పలు ఎడెనిమిది మున్సిపాల్టీలకు ఎన్నికలకు జరగాల్సి ఉంది. ఆ ఎన్నికలు జరిగినప్పుడే మిగిలి ఉన్న మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో ఎన్నికలు పెడతారని అనుకున్నారు. ఏర్పాట్లు కూడా చేశారు. కానీ ఎందుకో ఆగిపోయారు. ఇప్పటికీ ఎన్నికల గురించి ప్రస్తావించడం లేదు.
తాజాగా రాజమండ్రి కార్పొరేషన్‌తో పాటు మరో ఏడు మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యేకాధికారుల పాలన ముగిసింది. ఎన్నికలు నిర్వహించలేదు కాబట్టి.. మరో ఆరు నెలలు పాలన పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే.. ఇప్పుడల్లా ఎన్నికలు పెట్టే ఉద్దేశం లేదన్నమాట. పెండింగ్‌లో ఉన్న మున్సిపాల్టీల్లో .. గుడివాడ లాంటి కీలక నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్నవి ఉన్నాయి. వాటికి ఎన్నికలు పెట్టి ఎదురుదెబ్బ తగిలితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడుతుందన్న ఉద్దేశంతో వెనక్కి తగ్గినట్లుగా వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే స్థానిక ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలో జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసని.. భయపడే ప్రసక్తే ఉండదని కొంత మంది అంటున్నారు. ఎన్నికల వల్ల సమయం వృధా అవుతుందనే సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారని అంటున్నారు. కారణం ఏమైనా.. మిగిలి ఉన్న మున్సిపాల్టీల ఎన్నికలకు మాత్రం జగన్ సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఒక వేళ ఇప్పుడు ఎన్నికలు జరిగితే.. గతంలోలా అన్నింటినీ గెల్చుకుంటే.. విపక్షాలు ప్రచారం చేస్తున్న ప్రజా వ్యతిరేకత లేదని ప్రచారం చేసుకోవచ్చు. అయినా అలాంటి అడ్వాంటేజ్‌ను ప్రభుత్వం కోరుకోవడం లేదు.