ప్రకాశం జిల్లా, ఎర్రగొండపాలెం వైకాపా ఎమ్మెల్యే డేవిడ్ రాజు నిన్న తెలుగు దేశం పార్టీలో చేరడంతో వైకాపాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇంతవరకు అధికార పార్టీని ఏదో విధంగా ఇబ్బంది పెట్టడమే తప్ప వైకాపా ఎన్నడూ ఈవిధంగా ఇబ్బందిపడలేదు. తెలుగు దేశం పార్టీ చేపట్టిన ఈ ‘ఆపరేషన్ ఆకర్ష’తో వైకాపాకి పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అన్నట్లుగా తయారయింది.
పార్టీ మారదలచుకొన్న ఎమ్మెల్యేలు గుట్టు చప్పుడు కాకుండా అన్ని ఏర్పాట్లు చేసుకొని డేవిడ్ రాజులాగా పార్టీ మారిపోతున్నారు కానీ పార్టీలోనే ఉండాలనుకొనేవారికే చాలా ఇబ్బంది ఎదురవుతోంది. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు చేరబోతున్నారంటూ తెదేపా నేతలు, దాని అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం వలన పార్టీలోనే ఉండాలనుకొంటున్న వారిని కూడా అనుమానంగా చూసే పరిస్థితి వైకాపాలో ప్రస్తుతం నెలకొని ఉంది. అందువలన పార్టీ ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చి తెదేపాను విమర్శించి, తాము వైకాపాలోనే ఉంటామని చెప్పుకోవలసివస్తోంది. వైకాపా ఎమ్మెల్యేలు నారాయణ స్వామి, కంబాల జోగులు మరి కొందరు కలిసి ‘తెదేపా తమతో మైండ్ గేమ్స్ ఆడుతోందని, తాము దాని ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగబోమని, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంటే ఉంటామని చెప్పి ఆ తంతు పూర్తి చేసారు.
అయినప్పటికీ తెదేపా విసురుతున్న ఈ సవాలు నుండి ఏవిధంగా బయటపడాలో తెలియక వైకాపా నేతలు తలపట్టుకొంటున్నారు. ఆ పార్టీ నేత అంబటి రాంబాబు దీనికొక పరిష్కారం కనుగొన్నట్లున్నారు. తెలంగాణాలో ఓటుకి నోటు కేసులో తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని తెరాస ఏవిధంగా ట్రాప్ చేసిందో, అదేవిధంగా తమ ఎమ్మెల్యేలని ప్రలోభపెట్టేందుకు ఫోన్లు చేస్తున్న తెదేపా ఎమ్మెల్యేలని కూడా ట్రాప్ చేస్తున్నట్లు మాట్లాడారు. తెదేపాకి చెందిన కొందరు ప్రముఖ నేతలు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో చేసిన ఫోన్ సంభాషణల రికార్డులు తమ వద్ద ఉన్నాయని వైకాపా ప్రచారం మొదలుపెట్టింది. ఆ ప్రచారంలో భాగంగానే అంబటి రాంబాబు తమ వద్ద ఆధారాలున్నాయని ప్రకటించినట్లున్నారు. ఒక తెదేపా నేత వైకాపా ఎమ్మెల్యేకి పార్టీ మారేందుకు రూ.10 కోట్లు ఆఫర్ చేస్తే, వైకాపా ఎమ్మెల్యే రూ.40 కోట్లు డిమాండ్ చేసినట్లు, వారి ఫోన్ సంభాషణ రికార్డ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సరయిన సమయంలో ఆ ఆధారాలను బయటపెడతామని ఆయన చెప్పారు.
అయితే తెలంగాణాలో రేవంత్ రెడ్డి వ్యవహారంలో చావు తప్పి కన్నులొట్ట బోయినట్లు బయటపడిన తెదేపా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా మళ్ళీ అటువంటి సాహసం చేస్తుందనుకోలేము. తెలంగాణాలో తెరాస అధికారంలో ఉంది కనుక ఏసిబీ, పోలీసులు వంటి అన్ని వ్యవస్థలు దాని చేతిలో ఉన్నాయి కనుకనే అది రేవంత్ రెడ్డిని ట్రాప్ చేయగలిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షంలో ఉన్న వైకాపా అధికార పార్టీకి చెందిన తెదేపా నేతలను ట్రాప్ చేయగలదని అనుకోలేము.
తెదేపా ప్రభుత్వానికి పూర్తి మెజారిటీతో ఉన్నపుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలని పార్టీలోకి రప్పించడానికి పది కోట్లు చెల్లించడానికి సిద్దపడుతోంది అంటే నమ్మశక్యంగా లేదు. ఒకవేళ ఇప్పుడు పది కోట్లు చెల్లించి ఎమ్మెల్యేలను తెదేపాలో చేర్చుకొన్నా వారు ఎన్నికల సమయంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారినట్లయితే తెదేపాలో ఉంటారనే నమ్మకం ఏమీ ఉండదు కనుక అవసరం లేకపోయినా వారికి తెదేపా అంతంత డబ్బు చెల్లిస్తోందంటే నమ్మశక్యంగా లేదు. కనుక తమను దెబ్బ తీస్తున్న తెదేపాను నిలువరించడానికే వైకాపా నేతలు ఆవిధంగా ప్రచారం మొదలుపెట్టారేమో?