ఈడీ దాడులు జరగవచ్చని కేసీఆర్ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు ఈడీ ఎదుట హాజరయ్యారు. హవాలా, మనీలాండరింగ్ వంటి వాటికి తలసాని సోదరులు పాల్పడినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. చీకోటి ప్రవీణ్‌తో కలిసి వీరు క్యాసినో నిర్వహణలోనూ పాలు పంచుకున్నట్లుగా ఈడీ వర్గాలు చెబుతున్నాయి. చీకోటి ప్రవీణ్ ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. అంతే కాకుండా నాలుగైదు రోజుల పాటు ప్రశ్నించింది. ఈ క్రమంలో చీకోటి ప్రవీణ్‌తో లావాదేవీలు నిర్వహించిన వారి వివరాలు ఈడీకి లభించాయని వాటిలో తలసాని సోదరుల లావాదేవీలు కూడా ఉన్నట్లుగా చెబుతున్నారు. దీనిపైనే విచారణకు వారిని పిలిచారని చెబుతున్నారు.
ఐటీ , ఈడీ , సీబీఐ దాడులు జరిగే అవకాశం ఉందని ఎవరూ భయపడవద్దని కేసీయార్ పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. అయితే తాజా పరిమామాలతో పార్టీ నేతల ధైర్యం తగ్గిపోతోంది. పది రోజుల కిందట టీఆర్ఎస్ నేతలకు చెందిన గ్రానైట్ పరిశ్రమపై పెద్ద ఎత్తున ఈడీ అధికారులు దాడులు చేశారు. అనేక అవకతవలను గుర్తించామని ప్రకటించారు. మనీలాండరింగ్‌కు ఆధారాలు దొరికాయన్నారు. ఈ క్రమంలో.. తలసాని సోదరులను ఈడీ ప్రశ్నించడం ఆసక్తి రేపుతోంది.
కూకట్‌పల్లికి చెందిన టీఆర్ఎస్ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు ఇళ్లలో ఐటీ సోదాలు నిర్వహించారు. ఆయనకు రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. ముందు ముందు మరికొంత మంది కీలక టీఆర్ఎస్ నేతలు.. వారికి ఆర్థిక మద్దతు ఉన్న వ్యాపార సంస్థలపై దాడులు జరుగుతాయని భావిస్తున్నారు. మొత్తంగా బీజేపీతో కేసీఆర్ ఢీ కొడుతున్నారు.. దిగువ స్థాయి నేతలు మాత్రం నలిగిపోతున్నారు.