ఢిల్లీ లిక్కర్ స్కాంలో కొత్త కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ సారి కనికా టేక్రివాల్ రెడ్డి అనే మహిళ పేరు వెలుగులోకి వచ్చింది. ఈమెకు జెట్ సెట్ గో పేరుతో ప్రైవేట్ చార్టర్డ్ విమానాలు అద్దెకు ఇచ్చే కంపెనీ ఉంది. ఇటీవల కుబేరులు ప్రత్యేక విమానాల్లో తిరిగేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ నేతలు తిరుగుతున్నారు. ఈ కారణంగా ఈ జెట్ సెట్ గో కంపెనీకి గిరాకీ ఎక్కువగానే ఉంది. ఏపీతో పాటు.. తెలంగాణ ప్రభుత్వం కూడా అద్దెకు తీసుకునే విమానాలు.. చార్టర్డ్ ఫ్లైట్లు ఈ కంపెనీనే సమకూరుస్తుందని చెబుతున్నారు. ఈ కనికా టేక్రివాల్రెడ్డి.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన శరత్ చంద్రారెడ్డి భార్య.
శరత్ చంద్రారెడ్డి మొదటి భార్య.. అరబిందో ఫార్మా వ్యవస్థాపకుల్లో ఒకరైన నిత్యానందరెడ్డి కుమార్తె. విడాకులిచ్చారో లేకపోతే .. అలాంటి అవసరమే లేకుండా రెండో పెళ్లి చేసుకున్నారో కానీ కనికా టేక్రివాల్ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె పేరు కనికా టేక్రివాల్ రెడ్డి అయింది. పెళ్లి అయిన తర్వాత ఫ్లైట్ల బిజినెస్ స్టార్ట్ చేశారో అంతకు ముందే ప్రారంభించారో స్పష్టత లేదు కానీ.. ఈ ఫ్లైట్లలోనే ఢిల్లీ మద్యం స్కాంకు సంబంధించిన నగదును తరలించారన్న అనుమానాల్ని ఈడీ చేస్తోంది. ఈ కంపెనీకి చెందిన విమానాలు బేగంపేట నుంచి ఎక్కడెక్కడకు వెళ్లాయి.. ఎవరెవరు వెళ్లారన్న వివరాలను ఎయిర్ పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఈడీ సేకరించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో బయటకు లాగాలని ఈడీ గట్టి పట్టుదలగా ఉందని తాజా పరిణామాలతో తెలుస్తోంది. ఈ వ్యవహారం ఏపీలోనూ విస్తరించడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. అదాన్ డిస్టిలరీస్ సొమ్ముతోనే .. శరత్ చంద్రారెడ్డి ఈఎండీలు కట్టారని అంటున్నారు. ఈ కేసులో ఇప్పటికి బయటకు వచ్చింది గోరంత… ఇంకా తెలియాల్సింది కొండంత ఉందని రాజకీయవర్గాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి.