తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు లక్ష్మినారాయణ హైదరాబాద్లో వరుసగా రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడుతున్నాడు. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో పెద్ద ఎత్తున నగదు వసూలు చేసి అందరికీ కుచ్చుటోపి పెడుతున్నాయి. లక్ష్మినారాయణకు సాహితి ఇన్ఫ్రాటెక్ పేరుతో కంపెనీ ఉంది. ఆ కంపెనీ పేరుతో కొన్ని చోట్ల వెంచర్లు వేశారు. అమీన్పూర్తో పాటు కొంపల్లిలో హైరైజ్ అపార్టుమెంట్లు కడతామని ప్రీ లాంచ్ ఆఫర్లు ఇచ్చాడు. బ్యాంక్ లోన్లు లేకుండా డబ్బులు కట్టిన వారికి అతి తక్కువకే ఫ్లాట్లు కేటాయిస్తానని వందల కోట్లు వసూలు చేశాడు.
చెప్పినసమయానికి కనీసం పునాదులు వేయకపోవడంతో మోసపోయామని డబ్బులు కట్టిన బాధితులంతా పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు. మూడు నెలల కిందటే.. అమీన్ పూర్ వెంచర్ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా.. .కొంపల్లి వెంచర్ బాధితులు కేసులు పెట్టారు. అయితే వారందరి కష్టార్జితాన్ని సొంతానికి వాడేసుకున్న ఆయన.. ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. బాధితులకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదు.
ఏపీ రాజకీయ నేతలతో మంచి సంబంధాలు ఉండటంతో ఎంతో డిమాండ్ ఉన్న టీటీడీ బోర్డు సభ్యుడి పదవిని కూడా పొందారు. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనం అవుతోంది. బాధితులు పోలీసు కేసులు పెట్టడమే కానీ.. చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. దీంతో బాధితులు అన్యాయమైపోతున్నారు. వారి కష్టార్జితమంతా రాజకీయ మోసగాళ్ల చేతిలో ఆవిరైపోతోంది.