ఆరు నెలలు ముందుగా వెళ్తే అది ముందస్తు కాదు.. అని గతంలో అసెంబ్లీని ఆరు నెలల ముందుగా రద్దు చేసినప్పుడు కేసీఆర్ ప్రకటించారు. ఎందుకంటే ఎన్నికల సంఘం.. అసెంబ్లీ గడువు ముగిసే ఆరు నెలల ముందు ఎన్నికలు నిర్వహించవచ్చని… అందుకే ఆరు నెలల్లోపు ఎన్నికలు జరిగితే అది ముందస్తు కాదని ఆయన లాజిక్. ఈ సారి కూడా అదే ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోందని టీఆర్ఎస్ నేతలు ఓ అంచనాకు వచ్చారు. మరోసారి ఆరు నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్తారని..కార్యవర్గ భేటీలో సంకేతాలు వచ్చాయని అంటున్నారు.
ఇంకా ఎన్నికలకు పది నెలల సమయం మాత్రమే ఉందంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతల్లో కొత్త చర్చకు కారణం అవుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాల్సింది వచ్చే ఏడాది డిసెంబర్లో . అంట పదమూడు నెలల సమయం ఉంటుంది. కానీ కేసీఆర్ మూడు నెలల సమయం తగ్గించి… ఇక పది నెలలే ఉందని చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలు ఉండవని.. సమయానికే ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ చెప్పారు కానీ.. ఆయన రెండు, మూడు నెలల ముందుగా ఎన్నికలన్నట్లుగా చెప్పడంతో ఎన్నికల మోడ్‌లోకి వెళ్లిపోవాలని టీఆర్ఎస్ నేతలు అంచనాకు వచ్చారు.
కేసీఆర్ పొలిటికల్ యాక్షన్‌ను డిసెంబర్ నుంచి నెక్ట్స్ స్టేజ్‌కు తీసుకెళ్తున్నారు. ఆ నెలలో బీఆర్ఎస్కు అధికారికంగా అనుమతి లభిస్తుంది. టీఆర్ఎస్ అంతర్ధానమైపోతుంది. బీఆర్ఎస్ను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యక్రమాలు చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా విస్తరించాలంటే.. ముందు తెలంగాణలో గెలవాలి… అందుకోసమే.. ఆరు నెలలకూ అటూ ఇటూగా ముందుకు వెళ్లొచ్చని ఆ పార్టీ వర్గాలు నమ్మకంగా ఉన్నాయి. మార్చిలో బడ్జెట్ పెట్టిన తర్వాత ప్రభుత్వాన్ని రద్దు చేయవచ్చని ఎక్కువ మంది నమ్ముతున్నారు.